రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చేరికపై చెలరేగిన కలకలం చల్లబడిపోతున్నది. ఆయన తన మూడవ మజిలీలో సీనియర్ కాంగ్రెస్ నేతలను కలిసి మంచి చేసుకునే ప్రయత్నంలో మునిగివున్నారు. బహిరంగ వ్యాఖ్యలు విమర్శలు కూడా ప్రస్తుతానికి బాగా తగ్గించేశారు. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన జరిగితే కొంత హడావుడి వుంటుందనుకుంటే అదీ వాయిదా పడింది. వాయిదాకు ఒక కారణం టిపిసిసి అంతర్గత పరిస్థితులు సరిగాలేకపోవడం కూడా అంటున్నారు. ఈ లోగా శాసనసభకు రేవంత్ రెడ్డి రాజీనామా లేఖ ఒక ప్రహసనంగా మారిపోయింది. తన లేఖ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడకు ఇచ్చిన రేవంత్ ఆయన ఎందుకు పంపడం లేదో తెలియదని అంటారు. సభకు కూడా హాజరవడం లేదు. రాజకీయంగానూ భౌగోళికంగానూ కూడా చంద్రబాబు ఆ లేఖ పంపే అవకాశం లేదు. ఇక టిఆర్ఎస్ దానిపై పట్టుపడుతుందా అంటే వారు కాంగ్రెస్ నుంచి కొందరు సభ్యులను చేర్చుకున్నారు గనక గట్టిగా మాట్లాడలేరు. తెలుగుదేశం అంటే ఇద్దరు మినహా అందరినీ కలిపేసుకుని విలీనం అన్నారు గనక కథ ముగిసిపోయినట్టే.కాని కాంగ్రెస్ ఫిరాయింపుదార్లకు ఆ సూత్రం వర్తించదు. ఇప్పుడు రేవంత్ రాజీనామా చేయాలని టిఆర్ఎస్ గనక మాట్లాడితే వెంటనే వారందరి విషయం వివాదమవుతుంది. కాబట్టి వారు గప్చిప్. ఇక రేవంత్ కావాలంటే స్పీకర్‌కు నేరుగా సరైన రీతిలో లేఖ ఇచ్చి దగ్గరుండి ఆమోదింపచేసుకోవచ్చు. అయితే అందుకు ఆయన సిద్ధంగా లేరు. కాంగ్రెస్ కూడా వద్దనే అంటున్నది. ఇప్పటికిప్పుడైతే కొడంగల్‌లో పరిస్థితి అంత అనుకూలంగా లేదని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక వేళ ఉప ఎన్నిక జరిగి రేవంత్ గెలవలేకపోతే రేపటి ఎన్నికలకు ముందే ఓటమిని ఆహ్వానించినట్టవుతుంది. రాజీనామా ఆమోదించగానే ఎన్నికల సంఘం ఉప ఎన్నిక ప్రకటించకపోవచ్చు గాని ఒక వేళ హదావుడిగా వచ్చేస్తే దెబ్బతింటామన్న భయంకాంగ్రెస్వారికి వుంది. రేవంత్ కోసం మేమంతా ఎందుకు బలికావాలని వారు నిలదీస్తున్నారట. రెండు మూడు నెలలు క్షేత్రస్థాయిలో సమీకరణ చేసుకుంటే ఎన్నికలకు వెళ్లడం గెలవడం సాద్యపడుతుందని రేవంత్ సన్నిహితులే చెబుతున్నారు. కనుక ఏదో విధంగా అప్పటి వరకూ రాజీనామా సమస్య రాకుండా చేసుకుంటారన్నమాట. వ్యక్తిగతంగా ఆయనకు రాజీనామా చేయాలని వున్నా ఈ కారణంగానే సమయం తీసుకుంటారట.. మరి ఆ పార్టీ ఎప్పటికి అనుమతినిస్తుంది, అప్పటి పరిస్థితులు ఎలా వుంటాయి చెప్పడం కష్టం. ఇప్పటికైతే అది సశేషమే.