గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశంలో సీనియర్ నాయకుడు. ఎన్టీఆర్ కాలం నుంచి ఎంఎల్ఎగా వున్న ఈ రాజమండ్రి నేత ప్రతిపక్ష నేత జగన్పై వంటికాలితో లేస్తుంటారు. వయసు ఎక్కువైనా కుర్రాడిలా రెచ్చిపోతుంటారు. విధాన పరంగా చంద్రబాబు ప్రభుత్వ పోకడలపై కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు కూడా. ఈ కారణాల వల్లనే చంద్రబాబు నాయుడు ఆయనను అస్మదీయుడుగా పరిగణించరు. ఇటీవల మంత్రివర్గ విస్తరణ సమయంలో తన పేరు వస్తుందని ఆయన చాలా ఎదురు చూసి ఆశాభంగం చెందారు. ఆగ్రహపూరిత వ్యాఖ్యలు కూడా చేశారు. మొత్తంపైన విధేయతల ప్రసక్తి లేకుండా విధానపరమైన విషయాలపై విమర్శలు చేసే హక్క సంపాదించుకున్నారు. ఇప్పుడు శాసనసభను వైసీపీ బహిష్కరించింది గనక మేమే ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని పాలక పక్షం ప్రకటించడం ఆయనలాటి వారికి అచ్చి వచ్చింది. ఏదో ఒక సమస్యపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయడానికి సిద్ధమైనారు. తాజాగా జీరో అవర్పై ధ్వజమెత్తారు. తము ప్రస్తావించే ముఖ్యమైన అంశాలు కూడా లోతుగా విశ్లేషించకుండా పరిశీలిస్తున్నామని పైపనే చెప్పడం ఏమిటని ఆయన ఆగ్రహించారు. ముఖ్యమైన విషయాలపై ప్రభుత్వ అభిప్రాయాలు అనుభవాలు పంచుకోకుండా వూరికే మొక్కుబడిగా సమాధానమిస్తే ఎలాగని అడిగారు. దీనిపై మంత్రి అచ్చెం నాయుడు షరా మామూలు సమాధానమే ఇవ్వగా బిజెపి సభా నేత విష్ణుకుమార్ రాజు కూడా బుచ్చయ్యచౌదరి విమర్శ వాస్తవమని మద్దతు తెలిపారు. మొత్తంపైన ప్రతిపక్షం లేకున్నామేమే ఆ పాత్ర పోషిస్తామని చెప్పడానికి ఆయన అధికార పక్షానికి అక్కరకు వచ్చారు.