గతంలో నంది అవార్డులు ప్రకటించారంటే ఆ హడావుడే వేరుగా ఉండేది. ఎవరు బెస్ట్ యాక్టర్, ఏది బెస్ట్ ఫిల్మ్? అనే విషయాలపై చర్చ బాగా నడిచేది. సోషల్ మీడియా బాగా యాక్టీవ్ అయిపోయిన ఇలాంటి తరుణంలో… నంది అవార్డులు ప్రకటించిన మరుక్షణం ఫేస్బుక్, ట్విట్టర్లు షేకైపోవాలి. కానీ అదేం జరగలేదు. నంది అవార్డులు ప్రకటించారంటే ప్రకటించారంటూ… లైట్ తీసుకొన్నారు. ఫ్యాన్స్ చేసే హడావుడి కూడా ఏం లేదు. వరుసగా మూడేళ్లవి ఒకేసారి ఇవ్వడంతో నంది క్రేజ్ బాగా తగ్గిపోయినట్టు కనిపిస్తోంది. మీడియా కూడా అంత విస్ర్కృతంగా ప్రచారం చేయలేదు. పైగా ఈసారి నంది విషయంలో నెగిటీవ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ‘మాకు నంది వచ్చిందోయ్’ అంటూ సంతోషంగా ట్వీట్ చేసినవాళ్లుగానీ, ఫేస్ బుక్లో ఆనందాన్ని పంచుకొన్నవారు గానీ, మీడియా ముందుకొచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వడం గానీ జరగడం లేదు. దీన్ని బట్టి.. `నంది` స్థాయి ఎంత పడిపోయిందో ఊహించొచ్చు.
అవార్డులన్నీ ఒకేసారి ఇస్తే ఇలానే ఉంటుంది. కనీసం జాతీయ అవార్డులనైనా విడిగా ప్రకటిస్తే కాస్త విలువైనా వచ్చేది. ఇప్పుడు అవార్డుల ప్రదానం కూడా ఒకేసారి గంపగుత్తగా చేసేయాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం. జనవరిలో అందుకు ముహూర్తం సెట్ చేశారు. ఒకేసారి మూడు సంవత్సరాల అవార్డులు, అందులోనూ జాతీయ పురస్కారాలు ఒకే వేడుకపై ఇవ్వడం బాగానే ఉన్నా.. దాన్నీ ఏదో తూతూ మంత్రంగానే నడిపేస్తారేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి లాంటి స్టార్స్ అవార్డులు అందుకోబోతున్నారు. వీళ్లలో సగం మంది గైర్హాజరు అయ్యే ప్రమాదం కూడా కనిపిస్తోంది. అవార్డుల `పంపకం` సక్రమంగానే చేసిన ప్రభుత్వం – ఇప్పుడు అందించడంలో ఎలాంటి హడావుడి చేస్తుందో చూడాలి. ఇకనైనా ఏ యేడాది అవార్డులు ఆ యేడాదే ప్రకటిస్తే బాగుంటుంది. లేదంటే… మొక్కుబడి వ్యవహారంలా తయారయ్యే ప్రమాదం ఉంది.