మహేష్ బాబు కెరీర్లోనే భారీ డిజాస్టర్లలో ‘స్పైడర్’ ఒకటి. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. తమిళంలోనూ ఈ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చాడు మహేష్. అయితే.. ఈ ప్రయత్నం దారుణంగా బెడసికొట్టింది. బాక్సాఫీసు దగ్గర వసూళ్లు సాధించడంలో విఫలమైన స్పైడర్, విమర్శల మనసుల్నీ గెలుచుకోలేకపోయింది. ఈ సినిమా లోటు పాట్లపై భారీ చర్చ సాగింది. సోషల్ మీడియాలో సెటైర్లు కూడా బాగానే పడ్డాయి. మహేష్ అభిమానులు కూడా బాగా నొచ్చుకొన్నారు. మా హీరో ఇలాంటి సినిమా చేశాడేంటి? అని బాధపడ్డారు. మెల్లమెల్లగా ఇప్పుడే ఆ పరాభవం నుంచి తేరుకొంటున్నారు ఫ్యాన్స్. దానికి తోడు… మహేష్‌బాబు ఖాతాలో మరో నంది అవార్డు చేరింది. శ్రీమంతుడు తో ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకోబోతున్నాడు. స్పైడర్ గుర్తుతులు మర్చిపోతున్నట్టే అనుకొంటున్న తరుణంలో ఆ చిత్రబృందం ఓ పోస్టర్ని విడుదల చేసింది. ’50 రోజులు ఆడేసింది’ అంటూ.
ఆ పోస్టర్ చూసిన ఫ్యాన్స్‌కి నవ్వాలో, ఏడవాలో అర్థం కాని పరిస్థితి. ఈ సినిమా ఫ్లాప్ అన్న సంగతి స్వయంగా మహేష్ బాబు అభిమానులే ఒప్పుకొంటున్నారు, సినిమా విడుదలైన తరవాత చిత్రబృందం మీడియా ముందుకు రావడానికి భయపడిందంటే – స్పైడర్ ఏ స్థాయి ఫ్లాపో అర్థం చేసుకోవొచ్చు. సరేలే… అంటూ ఆ బాధ నుంచి ఉపశమనం లభిస్తున్న తరుణంలో ఇప్పుడీ పోస్టర్ విడుదల చేయడం అవసరమా?? మరోసారి నాన్ మహేష్ ఫ్యాన్స్ రెచ్చిపోవడానికీ, స్పైడర్‌పై సెటైర్లు వేసుకోవడానికీ తప్ప… వేరే ఉపయోగం ఏమైనా ఉందా??