Snehamera Jeevitham Review
తెలుగు360.కామ్ రేటింగ్ : 1.5/5
స్నేహం, ప్రేమ – ఇవి రెండూ ఎవర్ గ్రీన్. వీటి గురించి ఎవరెన్నిసార్లు చెప్పినా వినాలనిపిస్తుంది. ఎన్ని సినిమాలు తీసినా చూడాలనిపిస్తుంది. ఆ శక్తి…. ఈ జోనర్లకు మాత్రమే ఉంది. స్నేహం నేపథ్యంలో ఈమధ్య మనసుని హత్తుకొనే సినిమా ఏదీ రాలేదు. ‘ఉన్నది ఒకటే జిందగీ’ వచ్చినా.. ఆ ప్రయత్నం కాస్త వరకే ఫలించింది. ఇప్పుడు ‘స్నేహమేరా జీవితం’ అంటూ మరో సినిమా వచ్చింది. టైటిల్‌ని బట్టి.. ఇది ఫ్రెండ్ షిప్ కథ అని అర్థమైపోతోంది. 1982 నేపథ్యంలో సాగిన కథ ఇది. దర్శకుడు ఆ నేపథ్యాన్నే ఎంచుకోవడానికి కారణం ఏమిటి?? ఈ సినిమాలో ఫ్రెండ్ షిప్ గురించి కొత్తగా చెప్పిన పాయింట్ ఏమిటి? ఈ ప్రయత్నం ఎంత వరకూ ఆకట్టుకొంది?? అనేది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
* కథ
మోహన్ (శివ బాలాజీ), చలపతి (రాజీవ్ కనకాల) ఇద్దరూ ప్రాణ స్నేహితులు. మోహన్ ఓ అనాధ. అయినా సరే, చలపతి తన సొంత తమ్ముడిలా చూసుకొంటాడు. చలపతికి ఎమ్మెల్యే అవ్వాలనేది కోరిక. అయితే.. అమ్మాయిల పిచ్చి. పూల రంగడిలా తిరిగేస్తుంటాడు. ఇందిర అనే అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తాడు మోహన్. ఈ విషయం చలపతికి తెలుస్తుంది. ‘నీ ప్రేమకథని నేను సుఖాంతం చేస్తా మిత్రమా’ అంటూ మాటిస్తాడు చలపతి. కానీ అనుకోని పరిస్థితుల్లో ఇందిరను, చలపతిని చాలా సన్నిహితంగా చూడాల్సివస్తుంది. స్నేహితుడు మోసం చేశాడని తెలుసుకొని కుమిలిపోతాడు మోహన్. ఓ ప్రేమ జంటను కాపాడే ప్రయత్నం చేసినందుకు మోహన్ ప్రాణాలు తీయడానికి ఓ ముఠా ప్రయత్నిస్తుంటుంది. మరోవైపు చలపతికీ ప్రాణ హాని ఏర్పడుతుంది. వీరిద్దరికీ ఎదురైన ప్రమాదమేంటి? మోహన్, చలపతిలను చంపాలనుకొంటున్నది ఎవరు?? ఈ స్నేహితులు ఇద్దరూ మళ్లీ కలిశారా, లేదా?? అనేదే మిగిలిన కథ.
* విశ్లేషణ
1982 నేపథ్యంలో సాగిన కథ ఇది. ఈ కథని చెప్పడానికి 35 ఏళ్ల క్రితం ప్రేక్షకుల్ని తీసుకెళ్లాల్సివచ్చిందో అర్థం కాదు. ఇద్దరు స్నేహితులు, అపార్థాల వల్ల విడిపోవడం, మళ్లీ కలుసుకోవడం ఇలాంటి కథల్ని చాలా చూసింది చిత్రసీమ. ‘స్నేహమేరా జీవితం’ కూడా అంతే! ఇలాంటి కథలు కొత్తగా ఉండకపోయినా ఫర్వాలేదు. ప్రేక్షకుల ఎమోషన్ని టచ్ చేసేలా ఉంటే చాలు. ‘ఇలాంటి ఫ్రెండ్ మనకూ ఉంటే బాగుణ్ణు కదా’ అని అనిపించేలా చేయాలి. గుండెల్ని మెలిపెట్టే సన్నివేశాల్ని, హృదయానికి హత్తుకొనే సంభాషణల్నీ రాయగలగాలి. అయితే దర్శకుడు ఆ ప్రయత్నం కూడా చేయలేకపోయాడు. తెరపై సన్నివేశాలు ‘సాగు……….తూ’ ఉంటాయి తప్ప, ఏదీ హార్ట్ టచింగ్ గా అనిపించదు. మోహన్ చలపతిపై అసహ్యంతో కారులో పక్క ఊరు వెళ్లినప్పుడే కథ కూడా పక్కదోవ పట్టేసింది. ఈ స్నేహితులు మళ్లీ కలసుకోవడం అనే ఘట్టాన్నీ చాలా సాదా సీదాగా తెరకెక్కించాడు దర్శకుడు. చివర్లో ‘టైమ్ బాంబ్’ ఎపిసోడ్‌తో కాస్త ఉత్కంఠత కలిగిద్దామనుకొన్నా, ఆ ప్రయత్నం కూడా సాగలేదు. తన ప్రాణ స్నేహితుడు కనిపించకుండా పోతే, తన ఎమ్మెల్యే ప్రచారంలో బిజీ అయిపోతాడు చలపతి. ఇదెక్కడి స్నేహం అనిపిస్తుంది. ‘అయ్యే.. నా ఫ్రెండ్ కనిపించకుండా పోయాడే’ అన్న ఫీలింగ్ చలపతిలో ఏమాత్రం ఉండదు. అలాంటప్పుడు ‘ఈ స్నేహితులు ఎప్పుడు కలుస్తారు’ అనే ఉత్కంఠత ప్రేక్షకుడికి ఎందుకు ఉంటుంది. ఓ మందు పాట, రెండు స్పెషల్ సాంగ్స్… వేస్టే! ఈ కథని నచ్చడానికి తప్ప దేనికీ పనిచేయవు. సత్య ఆ కాసేపు కామెడీ చేయకపోతే, మరింత శిరోభారమయ్యేది. కథ 35 యేళ్ల నేపథ్యంలో సాగినా, డైలాగులు ఇప్పుడు మాట్లాడుకొంటున్నట్టే ఉంటాయి. ‘బావ కళ్లలో ఆనందం కోసం’ అనే డైలాగూ వాడేశారిందులో.
* నటీనటులు
శివ బాలాజీ, రాజీవ్ కనకాల పూర్తి స్థాయి పాత్రల్లో కనిపించారు. అయితే.. శివ బాలాజీ ప్రాధాన్యమే ఎక్కువ. రఫ్‌గా కనిపిస్తూ, చలాకీగా నటిస్తూ, ఎమోషన్స్‌ని బాగానే పండించాడు శివ బాలాజీ. రాజీవ్ కనకాల పూల రంగడు టైపు పాత్రలో మెరిశాడు. ఈ సినిమాలో తను మరింత యంగ్‌గా కనిపించాడు. శివ బాలాజీ, రాజీవ్‌ల మధ్య స్నేహం బాగానే వర్కవుట్ అయ్యింది. అయితే హీరోయిన్ పాత్ర తేలిపోయింది. సైకిల్ పట్టుకొని అటూ ఇటూ నడవడం తప్ప, తాను చేసిందేం లేదు. సత్య నటన ఆకట్టుకొంటుంది. తన పాత్రకీ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. మిగిలినవాళ్లలో గుర్తుంచుకొనేంత నటన ప్రదర్శించిన వాళ్లు లేరు.
* సాంకేతిక వర్గం
ఓ రొటీన్ కథని ఎంచుకొని, అందులో ఫ్రెండ్ షిప్ విలువ చూపిద్దామనుకొన్నాడు దర్శకుడు. తన కథ, కథనాలు రెండూ పేలవంగానే ఉన్నాయి. 1982 నాటి కథ అని చెప్పడానికి తన ఫ్రేములకు వేరే కలరింగు ఇచ్చాడు కెమెరామెన్. అది చూడ్డానికి కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. హత్తుకొనే మాటలు లేవు, హృదయాన్ని పిండేసే సన్నివేశాలూ లేవు. ఇక ఫ్రెండ్ షిప్‌ని చూసేదెక్కడ?? పాటలూ, నేపథ్య సంగీతం అంతంత మాత్రమే.
* తీర్పు
కొత్త కథైనా రాయాలి, లేదంటే పాత కథ కొత్తగా చెప్పాలి. ఇవీ కాదంటే ఓ కొత్త నేపథ్యాన్ని ఎంచుకోవాలి – ప్రేక్షకుడ్ని థియేటర్లో కూర్చోబెట్టాలంటే ఉన్న పద్ధతులు ఇవి. దర్శకుడు ఈ మూడింటిలోనూ విఫలమయ్యాడు. ‘స్నేహమేరా జీవితం’ అనేది ఎంత పాత పదమో, ఈ కథ అంత పాతది.
* ఫైనల్ టచ్ : హృదయాన్ని తాకని – స్నేహం!
తెలుగు360.కామ్ రేటింగ్ : 1.5/5