ఒకటి నిజం.. ఎన్నికల రంగంలో జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ తప్పక వుంటారు. తన పార్టీ కూడా వుంటుంది. అయితే అంతుపట్టని ప్రశ్న తనే పోటీ చేస్తాడా ఎవరితోనైనా చేతులు కలుపుతారా? కలిపితే బిజెపితోనా టిడిపితోనా?లేక ప్రశాంత కిశోర్ ప్రయత్నాలు ఫలిస్తే వైసీపీ జగన్‌కు చేరువవుతారా? ఈ ప్రశ్నలే ఆయన సన్నిహితులను వేధిస్తున్నాయి. ఇప్పుడైతే పార్టీ పేరిట హడావుడి చేయమంటున్నారు. వంటరిగా అన్నిచోట్ట పోటీ చేసేంత సీన్ కనిపించడం లేదు. ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకోవాలంటే టిడిపి బిజెపిలలో ఎవరు బెటర్ అనదే ఆ పార్టీవారిని వేధిస్తున్న ప్రశ్న. పవర్ స్టార్‌కు మాత్రం ఈ దీనిపై క్లారిటీ వుందట. కాని దాన్ని ఎన్నికలకు మూడు మాసాల ముందు మాత్రమే బయిటపెడతానంటున్నారట. మరి అప్పటి వరకూ క్షేత్రస్థాయి సిబ్బంది ఎన్నికల ఆశావహులు ఏమై పోవాలి? ఏమైనాసరే, నాకు అనవసరం అన్నది ఆయన సమాధానం. నేను ప్రజల కోసం పార్టీని పెట్టాను గాని పదవుల కోసం కాదు. వారి గురించి అధ్యయనం చేస్తున్నాను. అంతా పూర్తయ్యాక ఏ నిర్ణయానికి వస్తానో ఇప్పుడే చెప్పలేను అన్నది ఆయన వివరణ. దీని అర్థం టిడిపితో కలసిపోవడమే నని వైసీపీ అంటుంటే అదేం లేదని జనసేన కొట్టి వేస్తున్నది. ఇక ప్రత్యేక హౌదాపై అంత తీవ్రంగా మాట్లాడిన పవన్ బిజెపితో కలిసే అవకాశాలు చాలా తక్కువ. పైగా వారితోకలిస్తే టిడిపితో కలసినట్టే.ఆఖరు ఘట్టంలో అనివార్యత పేరిట అదే చేస్తారా లేక స్వంత ఉనికి నిలబెట్టుకుంటారా అన్నది పవన్ ముందున్న పెద్ద ప్రశ్న. ఈ క్లైమాక్స్ ఆయన చేతిలోనే వుంటుంది. కాని ఆయన మాత్రం అంతర్గత సమావేశాల్లో తీవ్రంగా పాల్గొంటూ ప్రతి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా తెలుసుకుంటున్నారట.