రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్ని ఈ మధ్యనే సింగపూర్ కు పంపింది ఏపీ సర్కారు! ఎందుకంటే, అక్కడ జరుగుతున్న అభివృద్ధిని తెలుసుకుని వస్తారని చెప్పారు. ఇంతకీ.. ప్రజలకు తెలియజెప్పాలనుకుంటున్న ఆ అభివృద్ధి మోడల్ ఏంటో, వాస్తవంగా వారికి అర్థమైంది ఏంటో అనేది వేరే చర్చలెండి. ఇప్పుడా అంశం ఎందుకంటే… దాదాపు అదే తరహాలో ప్రజా ప్రతినిధులందరూ పోలవరం ప్రాజెక్టు సందర్శించేందుకు వెళ్లారు. శాసన సభ, శాసన మండలికి చెందిన దాదాపు 110 మంది సభ్యులు అమరావతి నుంచి పోలవరం ప్రాజెక్టుకు బస్సుల్లో గురువారం వెళ్లారు. ఓ ఆరు బస్సులు ఏర్పాటు చేశారు. నాలుగు బస్సులు ప్రజా ప్రతినిధులుకు, మరో రెండు మీడియాకీ ఇతర భద్రతా సిబ్బందికీ కేటాయించారు. సీఎం క్యాంపు ఆఫీస్ నుంచి ఈ యాత్ర మొదలైంది.
దారి పొడువునా పచ్చని పైరుల్ని చూసి ప్రజా ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. ముందుగా పట్టిసీమను తిలకించారు. ఇదో అద్భుతం అని మంత్రులు, ఎమ్మెల్యేలు కొనియాడారు. దీన్ని పూర్తి చేసి రాయలసీమకు నీళ్లు ఇవ్వడం ప్రతిపక్ష వైకాపాకి ఇష్టం లేదనీ, విమర్శలు చేయడం జగన్ కు అలవాటైపోయిందని మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా విమర్శించారు. ఇక, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని నవయుగ భగీరథుడు అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి ఎంత చిత్తశుద్ధితో పట్టుదలతో ఉన్నారో పోలవరం నిర్మాణం పనులు చూస్తే అర్థమౌతుందన్నారు. ఆనాడు నాన్నగారు చెప్పిన సుజల స్రవంతి ఇదే అన్నారు. ఇక, ఇతర మంత్రులూ ఎమ్మెల్యేలు కూడా ‘ఆహా, ఓహో, అధ్బుతః, రెండు కళ్లు చాలడం లేదు, ఇదే కదా అభివృద్ధి అంటే…’ ఇలా ఎవరికి వచ్చిన గ్రామర్ లో వారు పొగడ్తల వర్షం కురిపించారు.
ఇంతకీ, ఈ పోలవరం ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం వల్ల ఏం జరిగింది..? నిర్మాణం పనులు ఏ దశలో ఉన్నాయో ప్రజా ప్రతినిధులు తెలుసుకున్నారు, అంతే కదా! అయినా, ఇందులో ప్రత్యేకంగా వారు తెలుసుకోవాల్సింది ఏముందీ.. ప్రతీ సోమవారం వీసీలు జరుగుతున్నాయి, డ్రోన్ కెమెరాలతో కూడా పోలవరం పనుల్ని సీఎం సమీక్షిస్తుంటే.. వీరంతా అక్కడే ఉంటున్నారు కదా. మీడియాలో కూడా తరచూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని చూపిస్తూనే ఉన్నారు.. వీరు ఇక్కడికి వచ్చి కొత్తగా తెలుసుకోవాల్సింది ఏముంది..? అంటే, ఏమీ లేదనే చెప్పాలి. ఈ పర్యటన ఒక ప్రచారార్భాటమే. వారిని వారే పొగుడుకునేందుకు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం! ఈ మధ్య పోలవరం ప్రాజెక్టు నిధులు, కేంద్ర సాయంపై కొన్ని అనుమానాలు వ్యక్తం కావడం, ఆలస్యం అవుతుందేమో అనే కథనాలు పెరగడం, పోలవరం సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఓ ఉన్నత స్థాయి సమావేశం ఉంటుందని ప్రకటనలు రావడం… ఈ నేపథ్యంలో కొంత గందరగోళ వాతావరణం ఏదైనా ఉందా అనే చర్చ మొదలైంది. దాన్నుంచి కొంత డైవర్ట్ చేయడం కోసం మాత్రమే… ఈ ప్రజాప్రతినిధుల పోలవరం సందర్శన అనే కార్యక్రమం పనికొస్తుందని చెప్పొచ్చు. వారి వ్యూహం కూడా ఇదేనేమో మరి!