London Babulu movie review, London babulu review
తెలుగు360.కామ్ రేటింగ్ : 2/5
విదేశాలపై మోజుతో.. లేదంటే అక్కడి జీతాలపై ఆశతో… దేశం విడిచిపెట్టాలనుకొంటున్న వారి కథలు, వెతలూ చూస్తూనే ఉన్నాం. ఈమధ్య విడుదలైన ‘గల్ఫ్’ కూడా అలాంటి కథే. అయితే ఈ తరహా కథలన్నీ సీరియెస్‌గా సాగేవే. దానికి కాస్త కామెడీ టచ్ ఇస్తూ, సమస్యని సున్నితంగానే చెప్పే ప్రయత్నం చేసిన సినిమా ‘లండన్ బాబులు’. ‘ఆండవన్ కట్టలై’ అనే తమిళ చిత్రానికి రీమేక్ ఇది. స్వాతి కథానాయిక కావడం, మారుతి ఈ సినిమాకి నిర్మాతగా మారడంతో ‘లండన్ బాబులు’పై కాస్త ఫోకస్ పడింది. మరి తెలుగులో ఈ సినిమా ఎలా వచ్చింది? లండన్ బాబులు నవ్వించారా, ఆలోచింపజేశారా??
కథ
గాంధీ (రక్షిత్)కి అన్నీ కష్టాలే. అమ్మ చనిపోతుంది. నాన్నకు పక్షవాతం. బావ కు ఆరు లక్షలు బాకీ. ఊర్లో ఉద్యోగం లేదు. ఎదిగే అవకాశాలు కనిపించవు. అందుకే లండన్ వెళ్లి, బాగా డబ్బు సంపాదించి తిరిగి రావాలనుకొంటాడు. తన స్నేహితుడు (సత్య)తో కలసి హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ బ్రోకర్ (జీవా)ని కలుస్తాడు. పాస్ పోర్ట్ అప్లికేషన్లో పెళ్లయ్యిందని రాస్తే, వీసా త్వరగా వస్తుందన్న మాటలు నమ్మి.. ‘భార్య’ పేరు దగ్గర అనుకోకుండా ‘సూర్యకాంతం’ అని రాస్తాడు. ఆ చిన్న తప్పు రక్షిత్‌ని ఎలాంటి సమస్యల్లోకి నెట్టింది? అందులోంచి ఎలా బయటపడ్డాడు?? సూర్యకాంతం (స్వాతి) అనే టీవీ రిపోర్టర్కీ, గాంధీకి పరిచయం ఎలా అయ్యింది?? అనేదే ‘లండన్ బాబులు’ కథ.
విశ్లేషణ
తమిళంలో పోలిస్తే.. తెలుగులో చేసిన మార్పులు చిన్న చిన్నవే. దర్శకుడు రీమేక్‌ని యధావిధిగా ఫాలో అయిపోయినా, అక్కడక్కడ ఇంప్రూవ్మెంట్లు చేసుకోగలిగాడు. నిజానికి చాలా చిన్న కథ ఇది. పాస్ పోర్టులో ఓ పేరు తప్పుగా వస్తే.. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో చెప్పారు. ఈ కథంతా ‘సూర్యకాంతం’ అనే పేరు చుట్టూనే తిరుగుతుంది. అయితే పాస్ పోర్టులో చిన్న తప్పు దొర్లితే, దాన్ని వెంటనే సరిదిద్దుకోవొచ్చు అన్న అవగాహన ఉన్న వాళ్లంతా ఈ కథకు అంతగా కనెక్ట్ కాకపోవొచ్చు. ఆ మాత్రం దానికి ఇంత ప్రాయాస పడాలా?? అనుకొంటే ఈ సినిమాతో కనెక్షన్ అక్కడితో తెగిపోతుంది. ‘సరేలే…’ అని సర్దుకుపోయి కూర్చుంటే మాత్రం దాన్నుంచి పండిన వినోదం ఆస్వాదించొచ్చు. సత్య కామెడీ చాలా వరకూ రిలీఫ్ ఇచ్చే అంశం. అతని జోకులు, వేసే వేషాలూ.. నవ్వు తెప్పిస్తాయి. ప్రతీ పాత్రనీ దర్శకుడి సరిగానే వాడుకొన్నా – ‘అనవసరం’ అనుకొనే ఎపిసోడ్లు చాలా ఉన్నాయి.
మురళీ శర్మకు అంత బిల్డప్పులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నాటకాల చుట్టూ సాగే సన్నివేశాలు కథకు అడ్డు పడతాయి. కోర్టు సన్నివేశాల్నీ బాగా లాగినట్టు అనిపిస్తుంది. తొలి సగాన్ని సత్య పాత్రని అడ్డుపెట్టుకొని ఈజీగానే లాగించేశాడు దర్శకుడు. అయితే ద్వితీయార్థం అతని ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. దానికి కారణం.. సత్యని లండన్ పంపేశాడు. ఇక్కడ వినోదం పంచే ఛాన్స్ లేకుండా పోయింది. క్లైమాక్స్‌కి ముందు కాస్త హడావుడి మొదలవుతుంది. అజయ్ ఘోష్ పాత్ర వచ్చాక.. ఈ కథ వేరేలా మలుపు తీసుకొంటుందేమో అనిపిస్తుంది. ధన్‌రాజ్‌ని అరెస్టు చేయించడం, అక్కడ కాస్త ఎమోషన్ పండించడం తప్ప… అదనపు ప్రయోజనం ఏమీ లేకుండా పోయింది. హీరో – హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఏమాత్రం పండలేదు. నిజానికి ఆ అవకాశం ఈ కథలో లేదు. స్వాతి ఉంది కదా అని డ్రీమ్ సాంగులేమీ వేసుకోకుండా… బ్యాక్ గ్రౌండ్ పాటలతో ముగించడం కాస్త ఉపశమనం కలిగించింది.
నటీనటులు
రక్షిత్‌కి ఇదే తొలి సినిమా. చూడ్డానికి తమిళ హీరోలా ఉన్నాడు. దాదాపుగా అన్ని సన్నివేశాల్లోనూ ఒకే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. కాకపోతే.. గాంధీ పాత్రకు అది సరిపోతుంది. డబ్బింగ్ ఎవరు చెప్పారో గానీ, బేస్ ఎక్కువైంది. సాధారణంగా హీరోయిన్ ఓరియెంటెడ్ టైపు పాత్రల్ని పోషిస్తుంటుంది స్వాతి. దాంతో పోలిస్తే… సూర్యకాంతం పాత్రకు ఉన్న ప్రాధాన్యత, ఆమె కనిపించిన సీన్లు తక్కువే అనుకోవాలి. స్వాతిలోని నటిని పూర్తి స్థాయిలో బయటకు తీసుకొచ్చే సన్నివేశాలేం పడలేదు. అందరికంటే ఎక్కువ ఆకట్టుకొన్నది సత్యనే. తన కామెడీ టైమింగ్ బాగుంది. జూనియర్ సునీల్‌ని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అజయ్ ఘోష్‌ది చిన్న పాత్రే. ధన్ రాజ్ ఓ కొత్త టైపు పాత్రలో కనిపించాడు. ఎమోషన్ డైలాగులు పలికించాడు. కన్నీళ్లూ పెట్టించాడు. తనని ఈ తరహా పాత్రలకు వాడుకోవొచ్చు. మురళీ శర్మతో సహా.. మిగిలిన వారివి చిన్న చిన్న పాత్రలే.
సాంకేతిక వర్గం
‘గుడి అంటే ఇంటి పక్కన ఉంది గానీ, దేవుడే మన పక్కన లేడు’ లాంటి డైలాగులు ఆకట్టుకొన్నాయి. దాదాపుగా ప్రతీ సన్నివేశంలో మెరుపులాంటి ఒక్క డైలాగ్ అయినా వినిపించింది. నేపథ్యంలో వినిపించే పాట బాగుంది. కెమెరా వర్క్ ఆకట్టుకొంటుంది. సినిమా రిచ్‌గానే ఉంది. చిన్ని కృష్ణ ఓ రీమేక్ కథని.. పాకం చెడకుండా తీర్చిదిద్దగలిగాడు. కామెడీ సీన్లు బాగా రాసుకోవడం ప్లస్ అయ్యింది.
తీర్పు
చిన్న పాయింట్‌ని పట్టుకొని రెండు గంటల సినిమాగా తీర్చిదిద్దడం కష్టమైన పని. అయితే ఆ పాయింట్ జనాలకు ఎంత వరకూ రీచ్ అవుతుందన్నది చూడాలి. ద్వితీయార్థంలో కామెడీ బాగా మిస్ అయ్యింది. కోర్టు సీన్లు విసిగించడంతో… ఫ్లేవర్ దెబ్బతింది.
ఫైనల్ టచ్: ‘లండన్ బాబులు’ వీసా దొరకడం కష్టమే!
తెలుగు360.కామ్ రేటింగ్ : 2/5