అమరావతిలో పర్యావరణ పరిరక్షణ గురించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఇచ్చిన అనుమతి చంద్రబాబు ప్రభుత్వానికి పెద్ద వూరటే అని చెప్పాలి. అప్పుడే ఆయన దానిపై వ్యాఖ్యానించారు కూడా. ఎందుకంటే ఈ ట్రిబ్యునల్ తీర్పు పర్యావరణ విషయాల్లో సుప్రీం కోర్టుతో సమానమే. పర్యావరణ పరమైన అంశాలను సుప్రీం కూడా ఇక్కడికే పంపిస్తుంటుంది. రాజధాని నిర్మాణం ఇంత వరకూ వచ్చాక ఆపడం జరుగుతుందని ఎవరూ అనుకోలేదు గాని తీవ్రమైన ఆంక్షలు వుంటాయేమోనన్న అంచనా వుండింది. అది కూడా లేకుండానే పర్యవేక్షక కమిటీలు వేయాలన్నఆదేశంతో సరిపెట్టారు. కరకట్టలు, కాలువలు వంటి విషయాల్లో యథాస్థితికి భంగం కలగకూడదని షరతు పెట్టారు గాని అవన్నీ అడ్డంకులు కాకపోవచ్చు.అయితే సమస్యలు లేవని కాదు గాని అనుమతి వచ్చాక వాటిని ఎలాగో నెట్టేసుకుపోవడం జరుగుతుంది.