ఈ రోజు సాక్షిలో చర్చకు వెళ్లినప్పుడు ఆసక్తికరమైన విషయం తెలుసుకున్నాను. గమనంలో రాసిన వ్యాసం మిత్రులకు చూపించడం కోసం వెతికితే ఎక్కడా ఆంధ్రజ్యోతి కనిపించలేదు. మీ దగ్గర లేదేమని అడిగితే ఆ పత్రిక తెప్పించడం లేదన్నారు. తెరపైన చూపించకపోవచ్చు, మీ మీడియా సమావేశాలకు పిలవకపోవచ్చు కార్యాలయానికి కూడా తెప్పించకపోవడమేమిటంటే అదంతే నన్నారు.జగన్ రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకు ఢిల్లీ వెళితే కేసుల గురించి వెళ్లారని బ్యానర్ ఇచ్చిన రోజునుంచి ఆంధ్రజ్యోతి మానేశారట. గతంలో మరో పెద్ద ఛానల్‌కు కూడా ఇలాగే ఈ పత్రిక వచ్చేది కాదు. మీడియా అని ఒక మాటతో చెబుతుంటాము గాని అందులో ఎన్ని ఛాయలు! ఎన్ని వైరాలు, వైరుధ్యాలు!! ఆంధ్రజ్యోతిలోనూ జగన్ గురించి అలాగే మాట్లాడే మాట కూడా నిజమే. చర్చలో కూడా మిత్రుడు కొమ్మినేని తెలుగు దేశం మీడియా అని ప్రస్తావించినప్పుడు ఇది వైసీపీ మీడియా కదా అని నేనన్నాను.వైఎస్బొమ్మ వేసుకుని నడపడం వేరు వారు చెప్పకుండా ఆ పార్టీకి ప్రచారం చేయడం వేరు అని ఆయన వాదించారు. అది తర్కమే గాని సారాంశంలో వచ్చే తేడా లేదు.