కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరిన తరువాత చాలా సమీకరణలు మారాయి. బయటకి ప్రదర్శించలేకపోతున్నా రేవంత్ చేరికపై కొంతమందిలో ఉండాల్సిన అసంతృప్తులు ఉన్నాయి. పార్టీ అవసరం కావొచ్చు, రాబోయే ఎన్నికల్లో తెరాసపై గెలిచి తీరాలన్న లక్ష్యం కావొచ్చు.. ఆ అసంతృప్తులు ఇప్పట్లో బయటపడే అవకాశాలు కాస్త తక్కువగా ఉన్నాయి. అయితే, రేవంత్ రాకను మొదట్నుంచీ వ్యతిరేకించిన నేతల్లో కోమటిరెడ్డి సోదరులు ఉన్నారు. పార్టీ అధిష్టానాన్ని కలిసి, ఆయన చేరికపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారనే ప్రచారం కూడా జరిగింది.ఈ తాజా పరిణామాలు కూడా ప్రేరేపిస్తున్నాయి కాబట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ మార్పు చర్చ మళ్లీ తెరమీదికి వచ్చింది. ఇదే అంశమై అసెంబ్లీ లాబీల్లో ఓ ప్రముఖ భాజపా నేత ఆఫ్ ద రికార్డ్ గా మిత్రుల దగ్గర మాట్లాడారని సమాచారం. కోమటిరెడ్డి బ్రదర్స్ కి వేరే ఆప్షన్ లేదనీ, వారు కచ్చితంగా భాజపావైపు రావాల్సిందే అంటూ ఆయన అభిప్రాయపడ్డారట.
ఇంతకీ, ఈ బ్రదర్స్ విషయంలో భాజపా విశ్లేషణ ఏంటంటే… ఈ ఇద్దరు నేతలు తెరాసలో చేరతారనే చర్చ గతంలో బాగానే వినిపించింది. నల్గొండ నుంచీ ప్రభావంతమైన నాయకులు చేరిక తెరాసకు కూడా అవసరం ఉండటంతో.. వీరిని చేర్చుకునేందుకు గులాబీ బాస్ కూడా సానుకూలంగా ఉన్నారనే అభిప్రాయాలూ వినిపించాయి. ఓ సందర్భంలో కోమటిరెడ్డి తెరాసలో చేరిపోతున్నట్టు కూడా వార్తలొచ్చాయి. చివరి నిమిషంలో మళ్లీ వెనక్కి తగ్గారు. ఇలా రెండుసార్లు జరిగింది. పార్టీ మార్పుపై వీరు గందరగోళ పడుతున్న సమయంలోనే తెరాస మరో ప్రత్యామ్నాయ నేతను వెతుక్కుంది! దీంతో కోమటిరెడ్డి పార్టీలోకి రాకపోయినా ఫర్వాలేదన్నట్టుగా తెరాస వ్యవహార శైలి మారింది. కన్ఫ్యూజన్ లో ఉండే ఆ బద్రర్స్ తో మనకేం పని అని గులాబీ బాస్ కూడా అనేసినట్టు సమాచారం! దీంతో కోమటిరెడ్డికి తెరాస ద్వారాలు మూసుకుపోయినట్టయింది.
భాజపా లెక్క ఇదే! కోమటిరెడ్డి సోదరులను తెరాస చేర్చుకునే పరిస్థితిలో లేదు. కాంగ్రెస్ లో రేవంత్ చేరారు, రేపోమాపో ఆయనకు కీలక బాధ్యతలు కూడా కట్టబెట్టేందుకు హైకమాండ్ సిద్ధంగా ఉందనే సంకేతాలూ వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి సోదరులకు భాజపా ఒక్కటే ప్రత్యామ్నాయం అనేది వారి వ్యూహం. భాజపా ఆ మధ్య ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్ష్ కు రేవంత్ పార్టీ మార్పు వ్యవహారం కొంత దెబ్బకొట్టింది. ఆ మిషన్ ను పునః ప్రారంభించుకోవాల్సిన అవసరం భాజపాకి కూడా ఉంది. దాన్లో భాగంగా ఈ చర్చను ఉద్దేశపూర్వకంగా భాజపా తెరమీదికి తెస్తోందేమో అనే కోణం కూడా ఇక్కడుంది. ఈ తాజా చర్చపై కోమటిరెడ్డి సోదరుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.