‘పొత్తుల గురించి ఎన్నికల సమయంలోనే మాట్లాడటం మాకు ఆనవాయితీ, ఈలోపు చర్చించం’ అని టీడీపీ నేతలు చెబుతుంటారు. ఆలోపుగా ఇతర పార్టీలను సంసిద్ధం చేసే బాధ్యత ‘ఆంధ్రజ్యోతి’ తీసుకుందేమో అనిపిస్తోంది! కొద్దిరోజుల కిందట.. ఏపీలో అసెంబ్లీ నియోజక వర్గాల సంఖ్య పెంచాల్సిన అవసరాన్ని భాజపాకి ‘కొత్త పలుకు’ ద్వారా ఉద్బోధించారు. సంఖ్య పెంచితే.. పొత్తులో భాగంగా భాజపాకి ఎక్కువ సీట్లు వస్తాయనీ, ఆ విధంగా భాజపా ఏపీలో బలపడుతుందనే విశ్లేషణ ఇచ్చారు. ఇక, ఈ వారం జనసేన పార్టీకి ‘పొత్తోపదేశం’ చేస్తున్నారు. అంతేకాదు, టీడీపీకి భాజపాకి మధ్య దూరం పెరుగుతోందన్నట్టుగా అభిప్రాయపడటం విశేషం. దీనికి నేపథ్యంగా గత కొన్ని రోజులుగా పోలవరం ప్రాజెక్టు విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలను ఉటంకించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర సాయం ఇప్పుడు ఆశిస్తున్న స్థాయిలో లేకపోతే… ఆ ప్రభావం టీడీపీ – బీజేపీల పొత్తుల మీద ఉంటుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ క్రేజ్ పై దేశవ్యాప్తంగా మబ్బులు కమ్ముకున్నట్టు కూడా చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోవాలనేది కూడా తెగేసి చెప్పేశారు. కలసిరాని భాజపాకి జనసేన విడాకులు ఇచ్చేసి, టీడీపీకి చేరువయ్యే పరిస్థితులు వారికి కనిపిస్తున్నాయట! ఎలాగూ, ప్రత్యేక హోదా విషయమై భాజపా అభీష్టానికి వ్యతిరేకంగా జనసేనాని పవన్ కల్యాణ్ తిరుగుబావుటా ఎగరేశారు కాబట్టీ, జనసేనతో కమలనాథులు చేతులు కలిపే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఇక, ఏపీలో మిగిలింది.. ప్రతిపక్ష పార్టీ వైయస్సార్ సీపీ. జగన్ పై ఉన్న అవినీతి కేసులు, ప్రతీవారం విచారణకు కోర్టుకు హాజరౌతుండటం.. ఈ నేపథ్యంలో వైకాపాతో జనసేన జతకడితే పవన్ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉందనీ వారే రాసేశారు. పోనీ, ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భాజపా, టీడీపీలు తెగతెంపులు చేసుకుంటున్నాయని కూడా తెగేసి చెప్పలేదు. భాజపాతో పొత్తు విషయమై టీడీపీ ఆలోచన ఏంటనేది కూడా గోడ మీది పిల్లివాటంగానే చెప్పారు. ‘ఎవరికి ఎప్పుడు ఏది ప్రయోజనం అనుకుంటే అదే చేస్తారు’ అంటూ ఓ వాక్యం రాసేసి ఎస్కేప్ అయిపోయారు.
సో… జనసేనకు టీడీపీతో పొత్తు వినా వేరే మార్గం లేదన్నట్టుగా చెప్పారు. అయితే, ఇక్కడ అసలు విషయాన్ని ప్రస్థావించకపోవడం గమనార్హం! అదేంటంటే… రాష్ట్రంలో అన్ని నియోజక వర్గాల నుంచి పోటీకి దిగాలనే ఉద్దేశంతోనే జనసేన ఉంది. సాధ్యాసాధ్యాలపై వచ్చే ఏడాది చివరిలో విశ్లేషించుకుంటామని కూడా ఆ మధ్య జనసేనాని చెప్పారు. ఇవేవీ ఈ విశ్లేషణలో పరిగణనలోకి రాలేదు. ‘ఆంధ్రజ్యోతి’ రాతలు ఎలా ఉన్నాయంటే… ఇతరులతో పొత్తు లేకుండా జనసేన పోటీకి దిగలేదని వీరే డిసైడ్ చేసేస్తున్నారు. ఆ పొత్తు కూడా టీడీపీతోనే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందనీ వీరే డిసైడ్ చేసేస్తున్నారు. భాజపా టీడీపీల మధ్య పొత్తు విషయానికి వచ్చేసరికి ‘ఎవరికి ఎప్పుడు ఏది ప్రయోజనం అనుకుంటే అదే చేస్తారు’అని వారే రాశారు. ఇదే సూత్రం జనసేనకు కూడా వర్తిస్తుంది కదా! టీడీపీతో కలిసి వెళ్లాలా, భాజపాతో పొత్తు పెట్టుకోవాలా, వైకాపాకి మద్దతు ఇవ్వాలా అనేది జనసేన నిర్ణయించుకుంటుంది. ‘వారికి అప్పుడు ఏది ప్రయోజనం అనుకుంటే అదే చేస్తారు’.. సేమ్ థియరీ! పొత్తు విషయంలో టీడీపీ నిర్ణయం ‘ఇదీ’ అని నిక్కచ్చీగా చెప్పలేనప్పుడు… జనసేన ‘అటే’ వెళ్లాలీ అని ఎలా నిర్దేశిస్తారు..?