పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత ఆచరణ సాధ్యం కాని హామీలిస్తూన్నారని తెదేపా మంత్రులు మండిపడ్డారు. ఆదివారం విభిన్న సందర్భాల్లో మాట్లాడుతూ విపక్ష నేతను మంత్రులు తూర్పారబట్టారు.
జగన్ హామీలు నెరవేర్చాలంటే 4 రాష్ట్రాల బడ్జెట్ కూడా సరిపోదని మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆ పాదయాత్ర రోడ్ కి మాత్రమే పరిమితం అని తమ పార్టీ ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకుంది అన్నారు.
గెలిచే అవకాశం లేదని తెలిసి జగన్ ఆలవి కాని హామీలు గుప్పిస్తున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆయన హామీలను జనం విశ్వసించడం లేదన్నారు.
అధికారం కోసం అసాధ్యం అయిన హామీలు ఇస్తున్న వైసీపీకి కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పట్టనుంది అని మంత్రి కామినేని శ్రీనివాస్ జోస్యం చెప్పారు. బంగారు పళ్ళెంలో భోజనం పెడతా అంటే జనం నమ్ముతారా? అని ఆయన ప్రశ్నించారు. కేవలం 10 రోజుల్లో జగన్ రూ. 1.50 లక్షల కోట్ల విలువైన హామీలు ఇచ్చారని లెక్కతేల్చారు.
ఏదేమైనా… విపక్ష నేత పాదయాత్ర ను విమర్శించే క్రమంలో తొలిసారి అధికార పార్టీ జగన్ హామీలను గురించి మాట్లాడడాన్ని బట్టి చూస్తే… విపక్ష నేత ఇస్తున్న వాగ్దానాలకు ప్రభుత్వం కౌంటర్ లు ఇవ్వడం తప్పనిసరి అని నిర్ణయించుకున్నట్టు అర్ధం అవుతోంది.