ఇండోనేషియా రాజధాని జకార్తా నగరంలో ఐక్యరాజ్యసమితి భవనం సమీపంలో ఈరోజు ఉదయం వరుసగా బాంబులు ప్రేలాయి. రాజధాని నడుబొడ్డున గల తామ్రిన్ అనే ప్రాంతంలో సరినా షాపింగ్ మాల్ లోపల నుండి తుపాకుల కాల్పుల శబ్దాలు కూడా వినిపిస్తున్నట్లు ఛానల్ న్యూస్ ఏషియా తెలిపింది. ఆ సమయంలో ఐక్యరాజ్యసమితి స్థానిక ప్రతినిధి జెర్మీ డగ్లస్ తన కార్యాలయంలోనే ఉన్నారు. తమ భవనానికి కేవలం 100 మీటర్ల దూరంలో బాంబు ప్రేలిందని ఆయన ట్వీట్ ద్వారా తెలియజేసారు.
ప్రత్యక్ష సాక్షులు ఏమి చెప్పారంటే స్థానిక కాలమాన ప్రకారం సుమారు 10.30 గంటలకు ఒక కారు చాలా వేగంగా హైవేను క్రాస్ చేసి వన్-వేలోకి ప్రవేశించి ఎదురుగా వస్తున్న కారును డీకొనడంతో బారీ ప్రేలుడు సంభవించినట్లు తెలిపారు. ఆ ప్రేలుడు ధాటికి ఆ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వృద్ధ దంపతులు మరణించారు. ఈ సమాచారం అందుకొన్న వెంటనే స్థానిక పోలీసులు, భద్రతా దళాలు అక్కడికి చేరుకొని ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టారు. ప్రస్తుతం సరినా షాపింగ్ మాల్ లో నుండి ఇంకా కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఉగ్రవాదులు షాపింగ్ మాల్ లోకి ప్రవేశించి ఉంటే చాలా ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది.