‘సైరా నరసింహారెడ్డి’ని జాతీయ స్థాయి చిత్రం అనుకొనే స్థాయిలో ప్రమోట్ చేయాలన్న కృతనిశ్చయంలో ఉన్నాడు రామ్ చరణ్. సంగీత దర్శకుడిగా రెహమాన్‌ని ఎంచుకోవడం, ఓ కీలక పాత్ర కోసం అమితాబ్‌ని తీసుకోవడం వెనుక ముఖ్య కారణం ఇదే. రెహమాన్, అమితాబ్ ఉన్నంత మాత్రాన సరిపోదు.. ఈ సినిమాకి జాతీయ స్థాయి ‘లుక్’ రావాలంటే చాలా చేయాలి. అందుకే హిందీలోనూ ఈ సినిమాని విడుదల చేస్తున్నాడు చరణ్. అదేదో డబ్బింగ్ సినిమా అనుకోకుండా, బిగ్ బీ ఉన్న సీన్లన్నీ హిందీలోనే షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. హిందీ వెర్షన్ కోసం కొంతమంది నటీనటుల్ని ప్రత్యేకంగా తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా సన్నివేశాలు అటు హిందీలోనూ, ఇటు తెలుగులోనూ తెరకెక్కిస్తారన్నమాట. దాంతో ‘సైరా’ని ద్విభాషా చిత్రంగా ప్రమోట్ చేయడం సులభం. హిందీ వెర్షన్‌ని విడుదల చేయడానికి ఓ నిర్మాతని కూడా వెదికే పనిలో ఉన్నాడు చరణ్. ‘బాహుబలి’ కరణ్ జోహార్ విడుదల చేయడం వల్ల…. ఆ సినిమాకి బాలీవుడ్‌లోనూ విస్క్రృతమైన ప్రచారం లభించింది. సేమ్ టూ సేమ్ అదే స్ట్రాటజీ.. ఈ సినిమా కోసం ఫాలో అవ్వాలని చూస్తున్నాడు. ఇందుకోసం బాలీవుడ్లో ఉన్న తన సన్నిహితులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడట. తనయుల సినిమాల్ని ప్రమోట్ చేయడానికి తాపత్రయపడుతున్న తండ్రులున్న ఈ ఇండ్రస్ట్రీలో చరణ్ ప్రయత్నం కొత్తగా కనిపిస్తోంది కదూ.