అదేంటో… ఈసారి నంది అవార్డ్ ఓ కామెడీ అయిపోయింది. ప్రతీ వొక్కరూ… మాట్లాడేయడమే. అవార్డు ప్రక్రియ ఎలా ఉంటుంది? ఏమిటి? అనే విషయాల్లో కనీస అవగాహన లేనివాళ్లు కూడా నోటి కొచ్చింది వాగేశారు. దాంతో బోల్డంత విమర్శలు, వివాదాలూ రేగిపోయాయి. ఇది వరకు ‘ఫలానా వారికి నంది వచ్చింది’ అని గర్వంగా చెప్పుకొనేవారు. ‘ఆయనకీ వచ్చేసిందట.. ఎలా తెచ్చుకొన్నారో ఏంటో’ అనుకొనే స్థితికి పడిపోయింది ఆ అవార్డు! అందుకే అవార్డు వచ్చిందన్న సంతోషం ఒక్కరిలోనూ కనిపించడం లేదు. ‘ఈ అవార్డు సాధించినందుకు ఆనందంగా ఉంది’ అంటూ ఒక్కరు కూడా ఫేస్ బుక్, ట్విట్టర్ సాక్షిగా పొంగిపోనూలేదు.
ఇప్పుడో కొత్త అనుమానం పుట్టుకొచ్చేస్తోంది. సదరు అవార్డు గ్రహీతలంతా నిక్కచ్చిగా… అవార్డు స్వీకరణకు వెళ్తారా, లేదంటే డుమ్మా కొట్టేస్తారా అని. ‘పైరవీలు చేసి అవార్డులు అందుకొన్నారు’ అనే అపవాదు చాలామంది మోస్తున్నారు. వాళ్లంతా ఇప్పుడు వేదికలెక్కి.. అవార్డులు తీసుకొంటూ ఫొటోలకు పోజులిస్తే… విమర్శకులకు మరోసారి అవకాశం ఇచ్చినట్టవుతుంది. అందుకే అవార్డు వచ్చిన వాళ్లలో చాలామంది ఈ కార్యక్రమానికి వెళ్లకపోవడమే బెటర్ అనుకొంటున్నారని తెలుస్తోంది. తెలుగు 360.కామ్ ఓ అవార్డు విన్నర్‌తో మాట్లాడితే.. ”అవార్డు వచ్చిందన్న సంతోషం లేదు. వెళ్లి తీసుకొంటే… వీడుకూడా పైరవీ చేశాడ్రోయ్ అనే సెటైర్లు వినిపించొచ్చు. నాకెందుకా గొడవ.. వెళ్లకపోవడమే బెటర్ అనిపిస్తోంది” అంటూ తన బాధని వెళ్లగక్కాడు. దాదాపుగా సగం మందిది ఇదే అభిప్రాయం. మెగా ఫ్యామిలీ ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టే ఛాన్సుంది. అక్కినేని హీరోలూ హాజరు కాకపోవొచ్చు. చిరంజీవికి రఘుపతి వెంకయ్య పురస్కారం ప్రకటించింది ప్రభుత్వం. ఆ అవార్డు ప్రతిష్టాత్మకమైనదే. అందుకు చిరు అర్హుడు కూడా. కానీ.. తాను వెళ్లి అవార్డు తీసుకొంటే ఓ బాధ, తీసుకోకపోతే మరో బాధ. ఒక వేళ తీసుకొంటే ‘మెగా హీరోలకు అవార్డుల విషయంలో అన్యాయం జరుగుతోంది’ అనుకొనేవాళ్ల మనసులు నొచ్చుకొంటాయి. వెళ్లకపోతే… ‘అవార్డు విలువ తెలీదా’ అంటూ విమర్శించే వాళ్లు మొదలవుతారు. అవార్డు సంగతేమో గానీ, చిరు మాత్రం భలే ఇరకాటంలో పడిపోయాడు. మిగిలిన వాళ్లు ఏం చేస్తారో చూడాలి మరి.