ఏపీ ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కర్నూలు జిల్లాలో సాగుతోంది. హుస్సేనాపురంలో మహిళా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై రొటీన్ విమర్శలు గుప్పించారు. గడచిన నాలుగేళ్లలో ఆయన ఏ పనులూ చేయలేదనీ, ప్రజలకు ఏమాత్రం మేలు జరగలేదనీ, ప్రజలను చేతులు పైకెత్తి ఇలా ఇలా ఇలా ఇలా లేదంటూ చెప్పాలని జగన్ కోరారు. నాలుగు సంవత్సరాల కిందట, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవాలనీ, అధికారంలోకి రావడం కోసం వాళ్లు చెప్పిన మాటలు ఒక్కసారి మననం చేసుకోమని జగన్ కోరారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారనీ, కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఎంతమంది బంగారాలు ఇళ్లకు వచ్చాయని ప్రశ్నించారు.
పొదుపు సంఘాల అక్కా చెల్లెళ్లకు సంబంధించిన రుణాలను పూర్తిగా రద్దు చేస్తానని అన్నారా లేదా అంటూ మహిళలను ప్రశ్నించారు. ‘మోసం చేశాడు. చేశాడా లేదా..? పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? రెండు చేతులు పైకెత్తి ఇలా ఇలా ఇలా ఇలా ఊపాలి. ఏమీ చెయ్యలేదు.’ అంటూ మాట్లాడారు. నాలుగేళ్ల కిందట అధికారంలోకి రావడం కోసమే చంద్రబాబు ఇచ్చిన హామీలేమిటో గుర్తు చేసుకోవాలన్నారు. నిజానికి, ఇది కొత్త విమర్శేం కాదు! పాదయాత్ర మొదలైన రోజు నుంచీ చేస్తున్న విమర్శల్లో ఇదీ ఒకటి! ఎలాగైనా అధికారంలోకి వచ్చేయాలన్న ఉద్దేశంతో ప్రజలను ఏమార్చే హామీలు ఇచ్చారంటూ చంద్రబాబుపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.
నాడు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అధికారం కోసమే అయితే… ఇప్పుడు ఎన్నికలకు ఏడాదిన్నర ముందు జగన్ చేస్తున్నది కూడా అందుకే కదా! అధికారంలోకి రావడం కోసం వాళ్లు ఇష్టానుసారం హామీలు ఇచ్చేశారంటూ ఇప్పుడు టీడీపీని జగన్ విమర్శిస్తున్నారు. గడచిన 13 రోజులుగా జగన్ ఇస్తున్న హామీలు కూడా అలాంటివే కదా! ఇష్టానుసారం ఇచ్చేస్తున్నవే కదా. గడచిన పదిరోజుల్లో జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే కనీసం లక్షన్న కోట్లు కావాలనే లెక్కలు కొంతమంది చెబుతున్నారు! చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు అందరికీ మాఫీ చేయలేదని జగన్ దగ్గర లెక్కలుంటే… ఆ విమర్శకే పరిమితం కావాలి! రైతు రుణమాఫీ అందరికీ అందలేదన్న జాబితా ఉంటే… ఆ విమర్శకే పరిమితం కావాలి! అధికారం కోసం ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారనే సంగతి అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడానికి టీడీపీ ఉక్కిరిబిక్కిరి అయిన పరిస్థితిని కూడా ప్రజలు చూశారు. ఇప్పుడు జగన్ ఇస్తున్న హామీలు కూడా అధికారం కోసమే కదా! ప్రజలను ఆకర్షించి.. ఓట్లు వేయించుకోవడం కోసమే లక్ష్యం! అలాంటప్పుడు, ‘అధికారంలోకి రావడం కోసం హామీలు ఇచ్చారు’ అనే ప్రస్థావన తీసుకుని రాకూడదు. చంద్రబాబు సర్కారు నెరవేర్చలేని హామీల గురించి ఎంతసేపు మాట్లాడినా బూమ్ ర్యాంగ్ కాకుండా ఉంటుంది.