ఒక గీతను చిన్నది అనిపించాలి అంటే… దాని పక్కనో పెద్ద గీత గీయాలి. ఒక సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలంటే ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించే మరో సమస్యను సృష్టిస్తే సరి.
చాలా మంది పాలకులు ఈ సూత్రాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు.
కొన్ని రోజుల కిందట అమరావతిలో బోటు మునిగి 23 మంది చనిపోయారు. మరెందరో గాయపడ్డారు. ప్రకృతి విపత్తులో మరొకటో దీనికి కారణం కాదు. అచ్చంగా ప్రభత్వ వైఫల్యం. అంతర్జాతీయ స్థాయి రాజదాని అవతరించనున్న చోట…చోటు చేసుకున్న పరువునష్టం.
దీనిపై మీడియా గట్టిగానే స్పందించింది. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక దాదాపు అన్ని మీడియా సంస్థలూ ప్రభుత్వ వైఫల్యం పై నోరు విప్పిన సంఘటన అది.
కట్ చేస్తే…. నంది అవార్డులు సినిమా మొదలైంది. పడవ ప్రమాదం 2 రోజుల్లోనే నంది ప్రవాహం లో కొట్టుకుపోయింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్… ఎక్కడ చూసినా నందుల గోలే. విచిత్రంగా ఎన్నడూ లేని విధంగా జ్యూరీ సభ్యులు సైతం ప్రత్యక్ష చర్చల్లోకి డిగిపోయి, ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్నారు. దీనితో ఇదొక ఎడతెగని ప్రహసనం గా మారింది.
నిజానికి ప్రభుత్వం తలచుకుంటే ఈ వివాదానికి ఎదో రకంగా ఫుల్ స్టాప్ పెట్టి ఉండొచ్చు. అలా చేయక పోగా కనీసం తాను నియమించిన జ్యూరీ సభ్యులను కూడా నియత్రించలేదు. ఏదైతేనేం… ఎంతో చర్చ జరిగి, కొత్త రాజదాని నగరo లో పర్యాటక సమస్యలపై అధ్యయనం జరిగేందుకు తద్వారా రేపటి అమరావతికి మరింత మేలు కలిగేందుకు దోహదపడాల్సిన దురదృష్టకర సంఘటన… పడవ ప్రమాదం పాడెక్కింది.
ఇటు ఈ ప్రమాదం తో పాటు అటు జగన్ పాదయాత్రకు కూడా ప్రాధాన్యత తగ్గించడమే ఈ నందుల గోల వెనుక దాగున్న ఆలోచన అని కొందరు ఆరోపిస్తున్నారు. అదే నిజమైతే… ఇలాంటి ఎత్హులతో పరిపాలన సాగితే… అంతకు మించిన ప్రమాదం ప్రజలకు మరొకటి లేదు