తమిళనాడులో దాదాపు 1900 మంది నిఘా సిబ్బందితో 187 భవనాలపై కొనసాగుతున్న దాడులు చాలా సంచలన పరిణామాలకు కారణమవుతున్నాయి. జయలలిత సహచరి శశికళ పోగేసుకున్న అక్రమాస్తుల వెలికితీత కోసం సాగుతున్న ఈ దాడులు అటు అన్నాడిఎంకెలో ప్రకంపనలు సృష్టించాయి. మరో వైపున శశికళ శిబిరంలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఆమె మేనల్లుడు పార్టీ నాయకుడు దినకరన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఫళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కలసి దేవాలయం వంటి జయలలిత ఇంటిపైనే దాడికి పాల్పడ్డారని విమర్శించారు. అయితే ఇవన్నీ కేంద్రం కనుసన్నల్లో జరిగాయి తప్ప తమకు సంబంధం లేదని ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు.ఇక శశికళ సోదరుడు దివాకరన్ మాత్రం ఏకంగా జయలలితపైనే దాడి చేశారు. ఆమె తన సోదరిని ఉపయోగించుకున్నారు గాని పోయేముందు ఎలాటి భద్రతలు లేకుండా వదిలేశారని వాపోయారు.1996 నుంచి చెన్న్‌లో కొనసాగుతున్న కేసులన్నిటిలోనూ జయలలిత ప్రథమ ముద్దాయి అని గుర్తు చేశారు. ఆమె తన పాటికి తాను పరలోకానికి వెళ్లిపోయింది గాని తన సోదరి శిక్షలు అనుభవిస్తూ బాధలు పడుతున్నదని ఆయన విచారం వెలిబుచ్చారు. ఈ వ్యాఖ్యలు తమకు అడ్డం తిరుగుతాయని గ్రహించిన దినకరన్ వెంటనే రంగంలోకి దిగి ఆవేశంలో ఆయన ఏదో అన్నారు గాని మాకు జయతో అనుబందం గర్వకారణమని ప్రశంసించారు. ఇప్పుడు చిన్నమ్మ శశికళ పడుతున్న కష్టాలకు జయ కారణం కాదని కూడా సర్దిచెప్పారు. అయితే ఒక్కసారిగా ఈ దాడులు చేయడంలో ఉద్దేశం పాలక అన్నాడిఎంకెను తమ తొత్తుగా మార్చుకోవాలనే బిజెపి వ్యూహంలో భాగమని బలమైన ఆరోపణలు వచ్చాయి. మిగిలిన వారి సంగతి అటుంచి స్వయంగా డిఎంకె నాయకుడు స్టాలిన్ ఒక ప్రకటన చేస్తూ అన్నాడిఎంకెను లొంగదీసుకుని తమిళనాడును గుప్పిటపెట్టుకోవాలని చూసూ బిజెపి కలలు కల్లలవుతాయని హెచ్చరించారు.