నంది కుంపటి రగులుతూనే ఉంది. రోజుకో రకమైన సెగ. పూటకో వివాదంతో నంది నలుగుతూనే ఉంది. తాజాగా నంది అవార్డులపై నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. నందుల్ని రద్దు చేయాలని, కొత్తగా కమిటీ ఏర్పాటు చేసి, అవార్డు గ్రహీతల్ని ఎంచుకోవాలని సూచించారు. తనకొచ్చిన నంది తిరిగిచ్చేస్తున్నా.. అంటూ ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. దాంతో పాటు కేసీఆర్ని పొగడ్తలతో ముంచేశాడు. కేసీఆర్ లాంటి నాయకుడు లేడని, తెలంగాణ ప్రజలు గొప్పవారని, ప్రజల్ని ఎలా గౌరవించాలో కేసీఆర్ని చూసి నేర్చుకోమని హితవు పలికాడు.
పరీక్షల్లో తప్పు జరిగితే, ఎన్నికల్లో తప్పు జరిగితే వాటిని రద్దు చేసినప్పుడు, అవార్డుల్లో తప్పు జరిగితే ఎందుకు రద్దు చేయరు?? అంటూ ఎవ్వరూ లాగని లా పాయింట్ లాగాడు. నంది అవార్డుల్లో తన పేరు చూసి ముందు ముచ్చటపడ్డానని, కాకపోతే నందిపై `కమ్మ అవార్డులు` అనే ముద్ర పడేసరికి… దాన్ని అందుకోవాలంటే సిగ్గుగా ఉందని పోసాని వ్యాఖ్యానించాడు. పనిలో పనిగా నారా రోకేష్ని ఓఆట ఆడుకొన్నాడు. లోకేష్ అనుభవరాహిత్యాన్ని, అసమర్థతనీ తనదైన శైలిలో ఎత్తి చూపించాడు. పోసాని నంది అవార్డుల్ని తిరిగి ఇచ్చేయడం నిజంగా… షాకిచ్చే విషయమే. ఈరోజు పోసాని… మరి రేపు ఎవరు?? నంది అవార్డులపై అసంతృప్తి ఉన్నవాళ్లంతా ఇదే మాట చెప్పగలరా?? నంది మాకొద్దు అని అసహనాన్ని చూపించగలరా?? పరిస్థితి చూస్తుంటే, పోసానిని స్ఫూర్తిగా ఒకరిద్దరు ప్రముఖులు నంది అవార్డుల్ని తిరస్కరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వాళ్లెవరన్నది ఒకట్రెండు రోజుల్లో తేలిపోనుంది.