“రేపో ఎల్లుండో ఎన్నికలున్నాయి. ఓటర్లను ఆకట్టుకోవాలి. తప్పదు… తాడో పేడో తేల్చుకోవాల్సిందే. ప్రత్యర్ధిని మించి హామీలు గుప్పించాల్సిందే” అన్నట్టుగా ఉంది ఎపి విపక్ష నేత జగన్ చేస్తున్న హడావిడి. విద్యార్ధులు, మహిళలు, వృధ్దులు… ఇలా ఎవరినీ వదలకుండా, అలాగే రైతాంగం, చేనేత రంగం…. ఇలా ఏ రంగాన్నీ వదలకుండా ప్రతి ఒక్కరినీ హామీల వర్షంలో తడిపి ముద్దచేసేస్తున్న ఆయన ఈ రోజు చాలా ప్రధానమైన రంగాన్ని స్పర్శించారు. గత కొంత కాలంగా అత్యధిక శాతం మీడియా తమకు వ్యతిరేకంగా ఉందంటూ వైసీపీ ఆరోపిస్తున్న నేపధ్యంలో జగన్ జర్నలిస్ట్‌ల కోసం హామీల లిస్ట్ బయటకు తీశారు.
కర్నూలు జిల్లాలోని బేతం చర్లలో ఆయన జర్నలిస్ట్‌ల తో పిచ్చా పాటీ మాట్లాడారు. ఈ సందర్భంగా తాము అధికారంలోకి వస్తే జర్నలిస్ట్‌లకు మేలు కలిగేలా పలు చర్యలు తీసుకుంటామన్నారు. చంద్రబాబు రిపోర్టర్లకు వ్యతిరేకం అంటూ వ్యాఖ్యానించారు. కేవలం యాజమాన్యాలతోనే మాత్రమే చంద్రబాబు మంచిగా ఉంటారన్నారు. అయితే వైఎస్ అలా కాకుండా జర్నలిస్టుల సంక్షేమం కోసం తాపత్రయపడేవారన్నారు. అదే విధంగా తాము అధికారంలోకి రాగానే ప్రతి జర్నలిస్ట్‌కి తన సొంత జిల్లాలోని ఇంటిస్థలం ఇస్తామన్నారు. అంతేకాదు ఇల్లు కూడా కట్టిస్తామని కూడా హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు అత్యవసరమైన అంశం అన్నారు. అవినీతి, ఓటుకు నోటు కేసుల కోసం రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు కేంద్రం దగ్గర తాకట్టు పెట్టారన్నారు.