పొలిటికల్ పోస్ట్ ఆఫ్ ది వీక్
‘పేడితనము పోయినను, ఆడ నడక పోలేదు’ ఈ డైలాగు దానవీరశూరకర్ణలోది. అర్జునుడిని చూసి దురోధ్యనుడు అనే మాట. అసమాన నటుడు ఎన్టీఆర్ నోట పలికిన డైలాగు కాబట్టి, ఆయన నటించిన అజరామరమైన సినిమాల్లో ఒకటి కాబట్టి ఆయన మనుమడు మీకు తెలియకుండా వుండదు. కచ్చితంగా తెలిసే వుంటుంది. ఎందుకీ ప్రస్తావన అంటే ‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమో, అప్పటికా మాట లాడువాడు ధన్యుడు’ అన్నాడు సుమతీకారుడు. ఇది ఎదుగుతున్న, ఇంకా ఎంతో ఎదగాల్సిన రాజకీయ నాయకుడిగా మీరు తెలుసుకోవాలి. తూచ్..నేనలా అనలేదు అనడానికి ఇవి రోజులు కావు. డిజిటల్ టెక్నాలజీ రోజులు. మాట నోట జారితే ప్రపంచం అంతటికీ ప్రయాణం కట్టేస్తుంది.
మీరు చూస్తే ఇంకా కాలేజీ రోజుల్లోనే వున్నట్లు కనిపిస్తోంది. ఫేస్ బుక్ లొ, వాట్సప్ ల్లో వచ్చినవన్నీ నిజాలే అనుకున్నట్లు, అక్కడ కనిపించే డైలాగులను మీ నోట వల్లె వేస్తున్నారు. ఇప్పుడు మీరు మంత్రి అన్నది విస్మరించినట్లు కనిపిస్తోంది నిన్నటికి నిన్న. మీ మూలాలు అన్నీ హైదరాబాద్ లో వుంచుకుని, సినిమా జనాలను హైద్రాబాదీలు, తెలంగాణ జనాలు అని ముద్రేసేసినట్లు మాటలు విసిరారు. నంది అవార్డుల మీద జరుగుతున్న యాగీ చూస్తే మీకు ఆవేశం రావడం సహజమే. కానీ సమస్య ఏమిటంటే, రాజకీయనాయకులు ఏం చేసినా ప్రజలు ఎలా భరిస్తున్నారో? ప్రజలు ఒక్కోసారి ఇలా రివర్స్ అయినా రాజకీయ నాయకులు సమ్మగా వున్నట్లు ఫేస్ పెట్టి ఊరుకోవాలి. అంతే కానీ కస్సు, బుస్సులాడకూడదు.
ఇప్పుడేమయింది ? సీను రివర్సయిపోయింది , పోసాని కృష్ణ మురళి భలే పాయింట్ పట్టారు. ఆంధ్రవాళ్లు తెలంగాణలో వుంటే మీరు ఇలా అంటున్నారు. మరింక తెలంగాణ వాళ్లు ఇంకెన్ని మాటలు అనాలి అనే టైపు పాయింట్ తీసారు ఆయన. అసలే తెలంగాణలో మన తెలుగుదేశం పార్టీ మూలుగుతున్న డ్యాష్ లా వుంది , దానిపై మీరు ఓ బండరాయి పడేసారు. మాటలు విసిరే లోకేష్ బాబు పార్టీ కన్నా, మనని ఏమీ అనని టీఆరెస్సే మిన్న అనుకునేలా చేస్తున్నారు.
ఇప్పుడు మంత్రి మీరు , వయసు తక్కువే కానీ హోదా ఎక్కువ అన్న సంగతి మరిచిపోతే ఎలా? వారసులు, కుక్కమూతి పిందెలు అన్నారు మీ తాత ఎన్టీఆర్. అలాంటి పెద్దాయిన పార్టీకి మిమ్మల్ని దిగ్విజయంగా వారసుల్ని చేసారు మీ నాయన ఆయన రాజకీయ చతురత అంతా వాడేసి. కానీ మీరు చూస్తుంటే, మొత్తానికే ఎసరు తెచ్చేలా కనిపిస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం వున్నవారు కూడా 2019 తరువాత మీరు అధికార పగ్గాలు తీసేసుకుంటారనే భావన వస్తేనే, అప్పుడెలా వుంటుందో అని ఉలిక్కి పడుతున్నారు. అలాంటి ఆలోచనలను దూరం చేయడానికి ప్రయత్నించాల్సిన బాధ్యత మీ మీద వుంది. కానీ మీరు చూస్తే రివర్స్ గేర్ లో వెళుతున్నారు.
తెలివైన రాజకీయ నాయకుల డిక్షనరీ అదే పదకోశం వేరుగా వుంటుంది. ‘అందరి అభిప్రాయాలు వింటున్నాం , పరిశీలిస్తాం , అవసరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటాం , అవసరం అయితే అందరితో సమావేశం అవుతాం’ ఇలాంటి పదాలు సర్వరోగనివారణి లాంటివి. ఏ సిట్యువేషన్ కైనా పనికివస్తాయి. మీరు ఎలాంటివి వాడినా, అవే వజ్రాలు, వైఢూర్యాలు అని చాటింపు వేయడానికి మీ అభిమాన గణం ఎలాగూ వుంటుంది. అందువల్ల ఇలాంటివి వాడి సులువుగా తప్పించుకుని వుండొచ్చు.
కానీ అవార్డుల వ్యవహారం మీ మామగారి చుట్టూ చుట్టుకోవడంతో, మీకు కూడా ఆయనకు వచ్చేంత ఆవేశం వచ్చింది. ఆయన తన ఫ్యాక్షనిస్టు సినిమాల్లో వాడే డైలాగులు మీ బుర్రలో గిర్రున తిరిగి వుంటాయి. దాంతో ఇలాంటి మాటలు మీ నోట దొర్లి వుంటాయి. అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పటికే పెద్దాయిన మీకు డైనింగ్ టేబుల్ దగ్గర క్లాసు పీకేసి వుంటారని అనుకుందాం. పీకినా పీకకున్నా, ఇకనన్నా మాటలు పేర్చుకుని వాడండి.ఆ పేర్పుడు సరిగ్గా లేదంటే పీఠాలు కదిలిపోతాయి.
అవును కానీ, మరో మాట. పంజాబ్ లో, కర్ణాటకలో, తెలంగాణలో హెరిటేజ్ వ్యాపారాలు చురుగ్గా నిర్వహిస్తున్న మీరు ఇలా ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు అంటూ చీప్ మాటలు మాట్లాడడం సరికాదని మీకు ఎందుకు అనిపించలేదు? నా మాట విని మీరు కొన్నాళ్లు ఫేస్ బుక్ ల్లో, వాట్సప్ ల్లో ‘మన వాళ్లు’ చేసే పోస్టింగ్ లు చూడడం మానేయండి. లేదూ అంటే అవే మీ బుర్రలోకి ఎక్కి, అవే మాటలు మీ నోటి వెంట వస్తున్నాయి. నాన్నారిని ఆదర్శంగా తీసుకోండి. వీలయితే రెండు మాటలు, ఓ కప్పు కాఫీ అన్నట్లు వుండండి కానీ, కాలేజీ సైకిల్ స్టాండ్ దగ్గర కబుర్లు చెప్పుకున్నంతగా మాట్లాడేయకండి. ఏమంటారు?
చిత్రగుప్తుడు