హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ గణేష్ మంటపాల్లో జరిగే లడ్డు వేలంపాటల్లో లడ్డు రు.10 నుంచి 15 లక్షల దాకా పలకటం అందరికీ తెలిసిన విషయమే. అయితే వీటన్నింటికి ఎన్నోరెట్లు అధిగమించేలా నిన్న ఒక దేవస్థానంలో జరిగిన వేలంపాటలో లడ్డు రికార్డ్ స్థాయిలో రు.77,77,777.77 పలికింది. మెదక్ జిల్లా సంగారెడ్డి శివారులోని శ్రీ మహాలక్ష్మి,గోదాదేవి సమేత శ్రీ విరాట్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రతి ఏటా గోదా శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామివారి లడ్డుకు వేలంపాట నిర్వహించటం ఆనవాయితీ. ఈ ఏడాది ఈ లడ్డును మాజీ ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు దామోదర రాజనర్సింహ భార్య పద్మిని రికార్డ్ మొత్తంతో సొంతం చేసుకున్నారు. గత ఏడాది ఈ లడ్డును టీఆర్ఎస్ నేత మురళీ యాదవ్ రు.7.77 లక్షలకు దక్కించుకున్నారు. ఈ ఏడాది రు.7,777 నుంచి వేలంపాటను ప్రారంభించారు. ఈ లడ్డూను దక్కించుకున్నవారికి మంచి జరుగుతుందన్న విశ్వాసంతో లడ్డును కైవసం చేసుకోవాలని నిర్ణయించుకున్నానని పద్మిని చెప్పారు. ధర ఎక్కువైందని కాకుండా లడ్డును దక్కించుకున్నాననే సంతోషం ఉందని అన్నారు.