నంది అవార్డులకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వ వాదనలు హాస్యాస్పదంగా వున్నాయి. ఎవరి సలహా పాటించారో గాని యువ నేత లోకేశ్ కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీటిని అందరం ఖండించాము కూడా. అయితే వీటిపై ధ్వజమెత్తిన పోసాని కృష్ణమురళి కూడాచాలా టూ మచ్ రాజా అన్నట్టే చేశారు. లోకేశ్,చంద్రబాబు పేరిట చలామణిలో వున్న వ్యాఖ్యలనూ ఆంధ్రజ్యోతి పతాక కథనాన్ని ఆయన ఖండించవచ్చు. అధార్ కార్డుకూ దీనికీ సంబంధమేమిటని ప్రశ్నించవచ్చు. కాని ఈ వివాదాన్ని కెసిఆర్‌పై పొగడ్తల వైపు తిప్పడం ఉద్దేశ పూర్వకమై వుండాలి. ఆయనే లేకపోతే మమ్ముల్ను కుక్కలను కొట్టినట్టు కొడతారని చెప్పడం మరీ వికృతంగా వుంది. అలాటి ఆలోచనలూ మాటలూ ఎందుకు వచ్చాయో తెలియదు గాని లేనిపోని శాడిస్టిక్ ధాట్స్లా వున్నాయి. అవార్డులు రాని వారి విమర్శలు ఒకటైతే ఈయన వచ్చినా విమర్శించి దాన్ని తిరస్కరించారు గనక సమస్య లేదు. అయితే రాని వారిలో దర్శకుడు గుణశేఖర్ ఎక్కువగా స్పందిస్తున్నారు. బాహుబలి రుద్రమదేవి ఒకే జోనర్ గనక ఇవ్వలేకపోయామని జ్యూరీ సభ్యురాలు జీవిత చేసిన వాదన బాలేదు. ఎందుకంటే అందులో ఒకటి జానపదం మరొకటి చారిత్రికం. కనుక అది రన్నర్ అప్‌అయ్యే అవకాశం కూడా వుండి వుండదు. అయితే గుణశేఖర్ రుద్రమదేవి ప్రజలనూ తీవ్రంగా నిరుత్సాహ పరిచిన మాట నిజం.ఆయనపైన ఆ చిత్రం పైన పెట్టుకున్న అంచనాలు తలికిందులు కావడానికి కారకులెవరు? ఇప్పుడు చరిత్ర క్యాటగరీలో ఏదో ఒక అవార్డు ఇవ్వలేదని తప్ప ధీమాగా అడుగుతున్న పరిస్థితి లేదు. దానవీరశూరకర్ణలో దుర్యొధనుడి పాత్ర పండినట్టు రుద్రమ దేవిలో గోన గన్నారెడ్డి పాత్ర ఎందుకు హైలైట్అయింది? ఆ పాత్రలో నటించిన అల్లు అర్జున్‌కు సీనియర్ నటుల తరహాలో క్యేరక్టర్ యాక్టర్ అవార్డు ఇవ్వడం విచిత్రమే. ఇటీవలే చిత్రం తీసి తను అలసిపోలేదని నిరూపించుకున్న చిరంజీవికి వెటరన్స్‌కు ఇచ్చే రఘుపతి వెంకయ్య పురస్కారం ఇవ్వడం కూడా అలాటిదే. మాస్ మసాలా హింసాత్మక చిత్రం లెజెండ్‌కు ఉత్తమ చిత్రంతో పాటు తొమ్మిది పురస్కారాలు దక్కడం అన్నిటికన్నా అభ్యంతరకరం. అక్కినేని ఫ్యామిలీ తీసిన మనం కూడామూడు తరాల మనుషులు మళ్లీ పుట్టడం కలుసుకోవడం.ముగ్గురూ కలసి తాగి పాడటం ఎబ్బెట్టుగానే వుంటాయి. అక్కినేనిని ఎంత అభిమానించినా ఈ అనౌచిత్యాన్ని పురస్కారంతో గౌరవించడం విడ్డూరమే. పైగా కొంతమంది ఆ చిత్రానికి ఇంకా పెద్ద అవార్డు రాలేదని గగ్గోలు పెట్టడం హాస్యాస్పదం. ఆయన సకుటుంబంగా నటించిన చివరి చిత్రం కాకుంటే – వారే లేకుంటే అదో ధర్డ్ రేట్ ప్రయోగంగామిగిలివుండేది. అయితే ఇచ్చిన వాటిలో న్యాయమైన ఎంపికలూ వున్నాయని అంగీకరించాలి. అందుకే పోసాని అతి స్పందననూ టూ మచ్ రాజా అనక తప్పదు. మీడియాలోనూ పరిశ్రమలోనూ చాలా మందికి ఈ భావన కలిగినా అనలేక మౌనం పాటిస్తున్నారు.