ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రపై ఎక్కువగా స్పందించకూడదని పాలక తెలుగుదేశం నిర్ణయించుకుందట. దానివల్ల ఆయనకు లేనిపోని ప్రచారం వస్తుంది గనక పెద్దగా మాట్లాడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టు సమాచారం. దీనిపై ఒక టీవీలో ప్రత్యేకంగా చర్చ చేశాము కూడా. మొదట్లో డజన్ల సంఖ్యలో మంత్రులు దాడి చేయడం వల్ల ఆరంభం అట్టహాసంగానే జరిగింది. ప్రజలు కూడా బాగానే వస్తున్నారు. అయితే వారంతా జగన్ విమర్శలకు లేదా వాగ్దానాలకు ప్రభావితులై ఇప్పటికిప్పుడు ఓట్లు వేస్తారా అనేది చెప్పగలిగింది కాదు.జగన్ తన మాటల్లో 2019లో అధికారానికి రావడం ఖాయమైనట్టు 2024 గురించి మాట్లాడ్డం మాత్రం విపరీతంగానే వుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసే యాత్ర ప్రభావం ఎన్నికల వరకూ వుంటుందనుకోవడం అవాస్తవికతే. వైఎస్ ప్రజా ప్రస్థానం మాత్రమే గాక ఎన్నికల ముందు మరో యాత్ర చేశారు. ప్రతిపక్షంలో వుండగా చంద్రబాబు నాయుడు మీకోసం యాత్ర వంటివి చేసినా ఎన్నికల ముందు సమన్యాయం అంటూ పర్యటించారు. కాబట్టి ఇప్పటి సంకల్ప యాత్రనే ఎన్నికల ప్రచారంగా భావించి వాగ్దానాలు గుప్పిస్తే ప్రయోజనం వుండదు. ఎన్నికలు ఎప్పుడు ఏ నేపథ్యంలో వస్తాయి, ఎవరెవరు ఎవరితో రంగంలో వుంటారు వంటి ప్రశ్నలను బట్టి ఫలితాలుంటాయి. ఇప్పటి వరకూ చూస్తే వైఎస్ వంటి వారి యాత్రలు జరిగినంత నిర్మాణాత్మకంగా జగన్ యాత్ర జరుగుతునట్టు కనిపించదు.స్థానికులకు ప్రాధాన్యత నివ్వడం, ప్రజలతో ముఖాముఖి వంటి వాటికి పెద్దపీట వేస్తే అప్పుడు మామూలు రాజకీయ ప్రసంగాలు మొక్కుబడి సభల అవసరం వుండదు. ఈ యాత్ర ఆకర్షించాలన్నా మామూలు కంటే భిన్నమైన అంశాలేవో అగుపించాలి గాని సాధారణ రాజకీయ ప్రచారమే అయితే ప్రయోజనం వుండదు. ఇప్పటికి గడచిన కాలం కంటే జరగబోయేది చాలా ఎక్కువగా వుంది గనక ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే బావుంటుందని వైసీపీ వారే అంటున్నారు. మీడియా చాలావరకూ ప్రచారం ఇవ్వడం లేదన్నది నిజమే గాని ఆ మీడియా ఇవ్వకతప్పని అంశాలను వెలికితీసి వారికి అందజేసి ప్రచారం పొందవలసిన బాధ్యత వైసీపీపైన వుంటుంది.