తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సాధారణంగా బహిరంగ సభల ద్వారానే ఎన్నికల ప్రచారం చేస్తుంటారు. కానీ జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో ఆయన ఆధునిక పద్దతిలో ఈ-ప్రచారం చేయబోతున్నారు. ఎన్నికల ప్రచారం కోసం నగరంలో తిరగడం మొదలుపెడితే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందనే ఉద్దేశ్యంతో ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ఈ పద్దతిలో వీడియో కాన్ఫరెన్స్ పద్దతిలో ఒక్కోసారి నగరంలో పన్నెండు డివిజన్ల చొప్పున మొత్తం 150 డివిజన్లలో నివసిస్తున్న ప్రజలతో ఆయన నేరుగా మాట్లాడుతారు. అదే సమయంలో ఆయన ప్రజలనుద్దేశ్యించి ప్రసంగాలు కూడా చేస్తారు. ఆయా డివిజన్లలో బారీ స్క్రీన్స్, ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడాటానికి అవసరమయిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. బహిరంగ సభలు ఏర్పాటు చేయడానికి చాలా శ్రమ, ఖర్చుతో కూడుకొన్నపని. కానీ ఈ-ప్రచారానికి అంత శ్రమ, ఖర్చు కూడా అవదు. పైగా ప్రత్యేకంగా ఎటువంటి సెక్యూరిటీ ఏర్పాట్లు చేయనవసరం లేదు. ఒకవేళ ఈ ప్రయత్నం విజయవంతం అయినట్లయితే, పార్టీలోని మిగిలిన ముఖ్యనేతలు అందరూ కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఉంది.
ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ ఇంతవరకు అమలుచేయడం లేదు కనుకనే ప్రజలకు వద్దకు వచ్చేందుకు వెనుకాడుతున్నారని అందుకే తన కొడుకు కె.టి.ఆర్., కుమార్తె కవిత తదితర నేతలను ప్రచారానికి పంపిస్తున్నారని తెదేపా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికలలో రాజకీయ నేతలు ప్రత్యక్షంగా ప్రజల వద్దకు వెళ్లి రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించినట్లయితే ఆ ప్రభావం ప్రజలపై బాగా ఉంటుంది. వాటితో ప్రజలను ఆకట్టుకొన్నట్లుగా ఈ- ప్రచారం ద్వారా ఆకట్టుకోవడం కష్టం. కనుక ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యలో రెండు మూడు బహిరంగ సభలు కూడా నిర్వహించాలనుకొంటున్నారు. ఒకవేళ అయన కేవలం ఈ-ప్రచారానికే పరిమితమయితే అది ప్రతిపక్షాలకి చాలా ఉపయోగపడవచ్చును. ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడానికి మంచి అవకాశం కూడా కల్పిస్తుంది.