తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్… స్వతహాగా చాలా చక్కగా మాట్లాడతారు. తొందరపడి మాట తూలడం, పొరపాటున నోరు జారడం, తడబడడం వంటి సమస్యల్లేకుండా సబ్జెక్టు మాట్లాడగల దిట్ట ఆయన. అలాంటాయన… గుడ్డు విషయంలో బ్యాడ్ అయ్యారు. విచిత్రమైన వ్యాఖ్యానం చేసి ప్రజలు విస్తుపోయేలా చేశారు.
హైదరాబాద్ నగరంలో పౌల్ట్రీ రైతుల సదస్సు జరుగుతున్న నేపధ్యంలో దానికి తెలంగాణ ఆర్థిక మంత్రి ఆటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన గుడ్డు ధర పెరగడం మీద మాట్లాడుతూ… గత కొంత కాలంగా గుడ్డు ధర అందరికీ అందుబాటులోనే ఉందన్నారు. గత రెండేళ్లలో దాని ధర రూ.3.50పైసలలోపే ఉందన్నారు. ఇలాగే పౌల్ట్రీ రైతుల సమస్యలు, వారి వ్యయ ప్రయాసల గురించి సానుకూలంగా మాట్లాడారాయన. అంతవరకూ బానే ఉంది కానీ గుడ్డు ధర పెరుగుతోంది అన్న మాటపై ఆయన వ్యాఖ్యానిస్తూ ఛాయ్, గుట్కా, సిగిరెట్… వగైరాలన్నీ రూ.10 పలుకుతుంటే గుడ్డు ధర పెరగడం పెద్ద వింతేముంది అనడం విశేషం. ప్రొటీన్‌ను పుష్కలంగా అందించే పోషకాహారమైన గుడ్డు వాటికంటే బెటర్ కదా అంటూ పోల్చారు.
సామాన్యులకు అందుబాటులో ఉండే అతి తక్కువ పోషకాహారాలలో గుడ్డు ఒకటి. అలాంటి గుడ్డు ధరలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. అంతే తప్ప వాటిని గుట్కాలు, సిగిరెట్ల ధరలతో పోల్చడం అవే పెరుగుతున్నప్పుడు ఇది పెరిగితే తప్పేమిటి అని అనడం ఎంత వరకూ సబబో మంత్రి ఆలోచించుకోవాలి. ఈ లెక్కన మద్యం, సినిమా టిక్కెట్లు వగైరాల ధరలతో బియ్యాన్ని, నిత్యావసరాలను పోలిస్తే… వామ్మో…