పోలవరం ప్రాజెక్టు విషయమై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రాకి జీవనాడి అన్నారు. పోలవరం చేపట్టిన దగ్గర నుంచీ తాను ఎన్నిసార్లు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించారో, వర్చువల్ ఇన్ స్పెక్షన్స్ చేశారో సభలో చెప్పారు. ప్రతీ సోమవారాన్ని పోలవారంగా మార్పు చేసి తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నానని చెప్పారు. మొత్తంగా రూ. 58 వేల కోట్లతో ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ముంపు గ్రామాలను ఏపీలో విలీనం చేయాలని కేంద్రం దగ్గర పట్టుబట్టాననీ, అప్పట్లో కేంద్రం కూడా సహకరించిందని చెప్పారు. కేంద్ర సాయం ఇప్పుడూ బాగుందని అన్నారు. ఇప్పటివరకూ దాదాపుగా రూ. 12 వేల కోట్లు పెట్టామని అన్నారు. కేంద్రం దాదాపు రూ. 4 వేల కోట్లు ఇచ్చిందనీ, ఇంకా సహకారం అందాల్సి ఉందన్నారు. ఇప్పటివరకూ 50 శాతం పనులు పూర్తయ్యాయనీ, రాబోయే రెండేళ్లలో మిగతా పనులు పూర్తవుతాయని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
అయితే, ఇదే సమయంలో పరోక్షంగా ప్రతిపక్షానికి చురకలు కూడా వేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎవ్వరు సహకరించకపోయినా ఫర్వాలేదుగానీ, అడ్డం రాకుండా ఉంటే చాలని చంద్రబాబు విమర్శించారు. కొంతమంది కేసులు అంటున్నారు, కోర్టులకు వెళ్తున్నారు.. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరతామని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. మొత్తానికి, పోలవరం ప్రాజెక్టు గురించి టీడీపీ చేస్తున్న కృషిని పరిపూర్ణ స్థాయిలో ఆవిష్కరించుకునే ప్రయత్నం చంద్రబాబు చేశారు.
నిజానికి, ఈ మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టు అంశమై కొన్ని విమర్శలు పెరిగాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ గానీ, వైకాపా నేత కేవీపీగానీ, ఇంకోపక్క భాజపా నేత పురందేశ్వరి.. ఇలా కొంతమంది రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది కోర్టుల్లో కేసులు కూడా దాఖలు చేశారు. కేంద్రానికి సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్లనే పోలవరం విషయంలో జాప్యం జరుగుతోందని ఈ మధ్యనే పురందేశ్వరి అన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో అన్నీ అబద్ధాలే చెబుతున్నారంటూ వైకాపా టోకున విమర్శ చేస్తోంది. ఇంకోపక్క.. ఈ ప్రాజెక్టు నిర్మాణ జాప్యం నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొంత దూరం పెరుగుతున్నట్టుగా కూడా కొన్ని ప్రకటనలు వింటున్నాం. సో.. మొత్తంగా వీటన్నింటికీ తన సుదీర్ఘ ప్రసంగం ద్వారా చెక్ పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించారని అనుకోవచ్చు. వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించడం ద్వారా.. సదరు నాయకులు చేస్తున్న ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టే ప్రయత్నంగా కూడా చూడొచ్చు. రాజకీయాంశాలు కాసేపు పక్కన పెడితే.. పోలవరం నిర్మాణం పూర్తయితే ఆంధ్రాలో ఎంతోమంది రైతులకు కచ్చితంగా ప్రయోజకరంగా ఉంటుంది. మరి, తాను చెప్పిన గడువులోపే పూర్తిచేస్తామని చంద్రబాబు అంటున్నారు! ఇంకోపక్క కేంద్ర సాయం ఇంకా అందాల్సి ఉందనీ అంటున్నారు, రాజీపడేది లేదనీ ప్రకటిస్తున్నారు. ఇవన్నీ ఎలా సమన్వయం చేసుకుంటారో మరి!