కొన్ని నెలల కిందట డ్రగ్స్ కేసు సంచలనమైన సంగతి తెలిసిందే. ఓ పదిమంది సినీ ప్రముఖుల జాబితా బయటపెట్టి, సిట్ ముందు విచారణ అంటూ బాగా హడావుడి చేశారు. తీగ లాగుతున్నాం.. మొత్తం డొంకంతా ఊడపీకేస్తామన్నట్టుగా అధికారులూ అధికార పార్టీ నేతలూ ప్రకటనలు దంచేశారు. ఆ తరువాత, రెండో జాబితా వరకూ వచ్చేసరికి ఏమైందో ఏమో తెలీదు, కేసు కాస్తా నీరుగారిపోయింది. ఈ విషయం గురించి మాట్లాడేవారే కరువయ్యారు. సేకరించిన శాంపిల్స్ ఏమయ్యాయో తెలీదు. ఎలాగైతేనేం, డ్రగ్స్ కేసు నెమ్మదిగా పక్కదారి పట్టేసింది. ఇప్పుడు ఇదే కేసును మరోసారి తెరమీదికి తెస్తున్నారు రేవంత్ రెడ్డి. ఈ కేసు విషయంలో తెరాస సర్కారు వైఫల్యాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెరాస సర్కారుపై విమర్శలు చేసేందుకు దీన్నో అస్త్రంగా మార్చుకుంటున్నారు.
రాష్ట్రంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేసుకునేందుకు అనుమతులు ఇవ్వరుగానీ విచ్చలవిడిగా పార్టీలు చేసుకునేందుకు పబ్ లకు అనుమతి ఇస్తారంటూ కాంగ్రెస్ నేత రేవంత్ మండిపడ్దారు. హైదరాబాద్ లో సన్ బర్న్ పేరుతో పార్టీ నిర్వహించేందుకు ఓ పబ్ కి అనుమతులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. పోలీసుల పహారాలోనే ఈ విచ్చలవిడి చేష్ఠలేంటని ఆయన ప్రశ్నించారు. ఈ పార్టీలకు టిక్కెట్లు అమ్ముతున్నది కూడా కేటీఆర్ బావమరిది అని చెప్పారు. పబ్బులు, క్లబ్బుల కోసమే తెలంగాణ వచ్చిందా? కేసీఆర్ సర్కారు హయాంలోనే డ్రగ్స్ కల్చర్ పెరిగిందనీ, స్కూళ్లలో కూడా డ్రగ్స్ లభ్యమయ్యే పరిస్థితి ఉందంటూ మండిపడ్డారు. పబ్బులకు అనుమతులు ఇవ్వడంలో తెలంగాణ సర్కారు మొదటి స్థానంలో ఉందంటూ ఎద్దేవా చేశారు. పబ్బులపై చూపిస్తున్న శ్రద్ధ డ్రగ్స్ కేసు మీద ఎందుకు చూపడం లేదంటూ నిలదీశారు. ఇంతకీ డ్రగ్స్ కేసు ఏమైందనీ, విచారణ ఎంతవరకూ వచ్చిందని రేవంత్ ప్రశ్నించారు. హైదరాబాద్ లో 24న జరుగుతున్న సన్ బర్న్ పార్టీకి అనుమతులు రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు.
మొత్తానికి, ముఖ్యమంత్రి కుటుంబంపై మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు రేవంత్. అయితే, ఈ క్రమంలో డ్రగ్స్ కేసు ప్రధానంగా ఊటంకించడం విశేషం. ఆ కేసు విచారణ ఏమైందంటూ నిలదీశారు. ఈ నేపథ్యంలో సర్కారు స్పందించే అవకాశం ఉంటుందేమో చూడాలి. వాస్తవం మాట్లాడుకుంటే.. డ్రగ్స్ కేసు అటకెక్కేసింది. ఈ విషయంలో కేసీఆర్ సర్కారు చేసిన ప్రకటనలన్నీ తాటాకు చప్పుళ్లు అనేది అర్థమౌతూనే ఉంది. అయితే, ఇప్పుడు ఇది రాజకీయాంశంగా మారుతోంది! ప్రభుత్వం తరఫు నుంచి కేసుకు సంబంధించి ఏదో ఒక కదలిక ఉండాలి. లేదంటే, రేవంత్ రెడ్డి ఈ టాపిక్ ను ఇక్కడితో వదలరు కదా.