కృష్ణా జిల్లాలో ఓ ఘటన చోటు చేసుకుంది. నున్న పోలీస్ స్టేషన్ దగ్గర కొంతమంది కౌలు రైతులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి ప్రయత్నించిన రైతులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ కొంతమంది రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర మనస్థాపానికి గురైన రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకుని, దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ఘటనపై ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఆత్మహత్యా యత్నం చేసి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతులను ఫోన్ ద్వారా పలకరించారు. వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.
రైతులు ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దు అని జగన్ ఈ సందర్భంగా కోరారు. మరో సంవత్సరం ఓపిక పట్టాలనీ, అప్పుడు వైయస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల సమస్యలన్నింటినీ తీర్చేస్తామని భరోసా ఇచ్చారు. వైకాపా అధికారంలోకి రాగానే ఆ రైతులుకు రూ. 2.30 కోట్లు వెంటనే ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నష్టపోయిన రైతులకు ఇదే విషయం చెప్పాలని జగన్ కోరారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిని వేధింపులకు గురిచేయడం దారుణం అంటూ అధికార పార్టీపై విమర్శలు చేశారు. సరిగ్గా ఓ ఏడాదిపాటు అందరూ ఓపిక పట్టాలని, మన పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు! రాష్ట్రంలోని రైతుల సమస్యలపై ఏడాదిన్నరగా పోరాటం సాగిస్తున్నామని ఈ సందర్భంగా జగన్ అన్నారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్టుగా… ప్రతీ సమస్యకూ తాను అధికారంలోకి రావడమే పరిష్కారం అని జగన్ పదేపదే చెప్తుండటం, కొన్నిసార్లు సరిపోవడం లేదు! రైతులు ప్రస్తుతం సమస్యలు ఎదుర్కొంటున్నారంటే… మరో ఏడాది వరకూ ఓపిక పట్టాలని చెబుతుంటే ఏమనుకోవాలి..? మరో ఏడాది వరకూ ఆయన ప్రతిపక్ష నేతగా ఉంటారు కదా! ఈలోగా రైతుల కోసం పోరాటాలు చెయ్యొచ్చు కదా. ఆ రైతులకు బాసటగా నిలిచి, తక్షణ సాయం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం బాబూ అంటే… ఏడాది ఓపిక పట్టండని చెప్పడం విడ్డూరంగా వినిపిస్తోంది! పైగా, ప్రతిపక్ష నాయకుడి బాధ్యతల నుంచి ఏడాది ముందుగానే జగన్ తప్పుకున్నట్టుగా ఉంది. రైతులు ఆత్మహత్యాయత్నం వరకూ వెళ్లారంటే… ఆ సమస్యల్ని మరో ఏడాదిపాటు భరించగలిగే శక్తి వారిలో ఉంటుందా..? జగన్ చెప్పారు కదా, ఆయనొస్తే కష్టాలు తీరిపోతాయి కదా.. అని మరో ఏడాదిపాటు కష్టాలు భరించేందుకు ఎంతమంది సిద్ధంగా ఉంటారు..? మీరు అధికారంలోకి వచ్చాక రైతుల సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోండి, మంచిదే. కానీ, ఇప్పటి సమస్యలకు తక్షణ పరిష్కారాలేంటో చెప్పండి..? ప్రతిపక్ష నేత చేస్తున్న కృషి ఏంటో వివరించండీ.