2010 జ్ఞాపకం వుందా? ప్రతిపక్ష తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం తీసుకురాకుండా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని అప్పట్లో వైసీపీ నేత జగన్ విమర్శించేవారు. బలాబలాలు మారిన తర్వాత లాంచనంగా అవిశ్వాసం పెట్టినా ఇబ్బంది లేకుండా పోయింది. అదంతా గతమనుకుంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు ప్రత్యక్షంగానే కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశంసిస్తున్నారు. కిరణ్ సోదరుడైన కిశోర్‌కుమార్ రెడ్డి కుమారుడు అమరనాథరెడ్డితో సహా తెలుగుదేశంలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు నల్లారి కుటుంబం ఘన చరిత్రను ఎంతగానో కొనియాడారు.పీలేరులో ఎనిమిదిసార్లు గెలిచారని పేర్కొన్నారు. అంతేగాక కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా వుండి హేతు విరుద్దంగా జరుగుతున్న రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడారని కూడా ప్రశంసించారు. అంతకన్నా విశేషమేమంటే అభివృద్దిలో తన స్వంత నియోజకవర్గమైన కుప్పంతో పీలేరు పోటీ పడాలని కూడా ఆకాంక్షించారు. ఇవన్నీ వింటుంటే చంద్రబాబు ఎంత వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. అప్పటిలాగే ఇప్పుడు కూడా కిరణ్‌రెడ్డి తమతో వస్తారనే భావన కలిగించడానికి ఆయన ప్రయత్నిస్తుండవచ్చు. నిజంగానే ఆయన టిడిపిలోకి వెళతారనే వార్తలు వున్నా కాంగ్రెస్ నేతలు మాత్రం కొట్టిపారేస్తున్నారు. కిరణ్ తమ పార్టీలోకి వస్తారని వారు ఆశిస్తున్నారు. అయితే ఇప్పట్లో కోలుకునే అవకాశం లేని కాంగ్రెస్‌లోకి నిజంగా వస్తారా అనేది సందేహమే. రాజ్యసభ స్థానం వంటిది ఇచ్చే అవకాశం వున్న టిడిపిలో చేరితే పనులు జరుగుతాయని అనుయాయులు కొందరు వత్తిడి తెస్తున్నట్టు కూడా చెబుతున్నారు.ఏం జరిగేది ముందు ముందు చూడాలి. మొత్తంపైన రోజులు గడిచే కొద్ది ఎపిలో కిరణ్ కుమార్ రెడ్డి పట్ల సద్భావం పెరుగుతుందని పరిశీలకులు ఆయన సన్నిహితులు అంచనా వేస్తున్నారు. వైసీపీ టీడీపీ రెండూ ఆయనను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నా కాంగ్రెస్‌లోకి వెళతారనే కథనాలు కూడా బలంగానే వున్నాయి. కాంగ్రెస్ కూడా ఆయనను మరో రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపే అవకాశం రావచ్చు. కిశోర్ టిడిపిలో చేరడం ఆయన స్వంత నిర్ణయం తప్ప కిరణ్‌కు సంబంధం లేదని మరో సమాచారం.