మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఒక్కోటిగా అమరావతికి చేరుకుంటున్నాయి. రాష్ట్రం విడిపోయాక తెలుగుదేశం పార్టీ ఏపీ రాష్ట్ర కార్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేసుకుంది. ఇతర పార్టీలు కూడా అదే బాటలో ఆంధ్రాకు చేరుకున్నాయి. అయితే, ప్రతిపక్ష పార్టీ వైకాపాకి మాత్రం కొద్దిరోజుల కిందటి వరకూ ఏపీలో ఆఫీస్ లేదు. జగన్ పాదయాత్రకు ముందే విజయవాడలో ఆఫీస్ ఓపెన్ చేశారు. ఇక, మిగిలింది జనసేన పార్టీ. వచ్చే ఎన్నికల్లో సొంతంగా అన్ని నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు సిద్ధమౌతున్నట్టు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు జనసేన కూడా సంసిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో జనసేన ఆంధ్రా కార్యాలయాన్ని గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు. చినకాకాని దగ్గర మూడున్నర ఎకరాల భూమిని జనసేన పార్టీ ఒక రైతు దగ్గర లీజుకు తీసుకుంది. ఆ లీజు సమయం కూడా మూడేళ్లే కావడం గమనార్హం.
అయితే, మూడేళ్ల లీజ్ ఏంటనేదే ఇప్పుడు చర్చనీయాంశం! సాధారణంగా, భూమి లీజు అంటే కనీసం ఓ ఐదేళ్లు, ఏడేళ్లు పెట్టుకుంటారు. ఎందుకంటే, ఆ స్థలంలో కార్యాలయం నిర్మించుకోవాలి. ఆ నిర్మాణానికి కూడా బాగానే ఖర్చు అవుతుంది కదా. దాంతో పాటు లీజు సొమ్ము కూడా స్థలం యజమానికి ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు, కనీసం ఓ ఐదేళ్లయినా లీజు ఉండాలి. కానీ, జనసేన పార్టీ మూడేళ్లు లీజుకు స్థలం తీసుకోవడం వెనక వేరే ఆలోచన ఏదైనా ఉందా అనే చర్చ జరుగుతోంది. దీనిపై రకరకాల కథనాలూ వినిపిస్తున్నాయి. ఎన్నికల తరువాత, అప్పటి పరిస్థితిని బట్టీ ఆంధ్రాలో ఆఫీస్ విషయమై నిర్ణయం తీసుకుంటారనే అభిప్రాయం చక్కర్లుకొడుతోంది. అదేం కాదూ… వచ్చే ఎన్నికల తరువాత శాశ్వత భవనం నిర్మించుకుందామనే ఆలోచన ఆ పార్టీకి ఉందని కొంతమంది అంటున్నారు. అందుకే, మూడేళ్లకే లీజుకు తీసుకున్నారన్నంటున్నారు. కానీ, ఈ స్వల్ప వ్యవధి లీజు వెనక వాస్తవ పరిస్థితి మరోలా ఉందని తెలుస్తోంది!
అమరావతికి దగ్గర్లోనే పార్టీ కార్యాలయం ఉండాలని పవన్ కల్యాణ్ మొదట్నుంచీ పట్టుబడుతూ వచ్చారట. ఆ విధంగానే విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో స్థలం కోసం అన్వేషించారు. కానీ, అనువైన స్థలం వారికి లభించలేదు. అంతేకాదు, ఐదు లేదా పదేళ్లపాటు లీజులుకు ఇచ్చేందుకు కూడా రైతులు మొగ్గు చూపడం లేదు. ఎందుకంటే, మరో రెండుమూడేళ్లలో భూముల ధరలు అనూహ్యంగా పెరగొచ్చనే అంచనా వారికి ఉంది. ఏళ్ల తరబడి లీజుకు ఇవ్వడం సరైంది కాదనేది వారి లెక్క. అందుకే, జనసేన కార్యాలయానికి మూడేళ్ల లీజుకు మాత్రమే స్థలం దొరికిందని అంటున్నారు. ఎలాగూ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది కాబట్టి, కార్యాలయ స్థలం కోసం అన్వేషణ పేరుతో సమయం వృధా చెయ్యొద్దని పవన్ పదేపదే చెప్పడంతో ఈ మూడున్నర ఎకరాలను లీజుకు తీసుకున్నట్టు సమాచారం.