ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి కొడంగల్ స్థానానికి ఇప్పట్లో రాజీనామా చేసే అవకాశం లేదని స్పష్టమవుతున్నది. ఉప ఎన్నికల్లో ఎలాగైనా ఆయనను ఓడించి శాశ్వతంగా ఆయనను దెబ్బతీయాలని ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను బలహీనపర్చాలని ఉవ్విళ్లూరుతున్న పాలక టిఆర్ఎస్కు ఇది చాలా నిరుత్సాహం కలిగిస్తున్నది. అందుకే మండలి విప్ పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామా స్పీకర్‌కు ఇవ్వాలని సవాలు చేశారు. ఓటుకు నోటు కేసును కూడా అటకపై నుంచి దించారు. ఇవన్ని చూసి రేవంత్ రెడ్డి రోషానికి పోవాలనుకున్నా ఇప్పుడు కాంగ్రెస్ ఒప్పుకునే పరిస్థితి లేదు. ఒక్క ఉప ఎన్నిక గనక సర్వశక్తులూ మోహరించి కెసిఆర్ తేలిగ్గా దెబ్బతీస్తారన్న అంచనా ఒక కారణం. దానివల్ల రేవంత్ ఓడిపోవడమే గాక ఎన్నికల ముంగిట్లో కాంగ్రెస్ పరువు పోకూడదని కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గట్టిగా భావిస్తున్నారట. అందుకే ఆ విషయంలో మరీ ఆవేశపడొద్దని రేవంత్‌ను ఒప్పిస్తున్నారు. వ్యక్తిగత ప్రతిష్ట కోసం కావాలంటే ఏదైనా సమయం చూసి రాజీనామా లేఖ ఇచ్చే విషయం ఆలోచిద్దామని సర్దిచెబుతున్నారట. ఆయన కూడా మారుతున్న పరిస్థితులు పొంచివున్న సవాళ్లు గమనించిన తర్వాత నెమ్మదించినట్టే కనిపిస్తుంది. కాబట్టే రాజీనామాపై ఏవో రాజకీయ తర్కాలు లేవదీయడం తప్ప వెంటనే ఇస్తానని చెప్పడం లేదు. ఎన్నికలు కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత లాంఛనంగా అప్పుడు రాజీనామా అనొచ్చు గాని ఇప్పుడైతే తొండరపడరు. తాజాగా సన్‌బర్న్ షోకు సంబంధించి మంత్రి కెటిఆర్‌పై రేవంత్ ఆరోపణలు చేయగానే అధికార పార్టీ రాజకీయ దాడి చేయడం భవిష్యత్ పరిణామాలకు ఒక సూచిక మాత్రమే. రేవంత్‌కు ఇప్పటికీ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సత్సంబంధాలు వున్నాయనీ ఆయన దగ్గర సూచనలు తీసుకుంటారని వస్తున్న కథనాల నేపథ్యంలోనే ఓటుకు నోటును ప్రస్తావించారు. అంటే ఆయనను అదుపులో పెట్టాల్సింది చంద్రబాబేనని గుర్తు చేశారన్నమాట.