అధినేతను మెప్పించడం కోసం అతిగా కీర్తించడం, అవతలివారిపై దాడి చేయడం టిడిపి నేతల నిత్య కృత్యాలుగా మారాయి. విభజన తర్వాత తెలంగాణలో బాగా వెనకపట్టు పట్టి విజయవాడ వీటికి కేంద్రంగా మారినట్టు కనిపిస్తుంది. రాజధాని రాజకీయ క్రీడలో ఎక్కడ వెనకబడిపోతామోనని దాదాపు అరడజను మంది నాయకులు అహౌరాత్రాలు పెనుగులాడుతున్నారట. బోండా ఉమామహేశ్వరరావు, రాజేంద్ర ప్రసాద్, వంశీ, వర్ల రామయ్య, జూపూడి ప్రభాకరరావు వంటివారికి ఈ పెనుగులాటే సరిపోతున్నది.వీరందరి వీరోచిత విన్యాసాలలో ఒకోసారి ఒక్కొక్కరు బాగా స్కోరు చేశారనిపించుకోవడం, అంతలోనే ర్యాంకులు మారడం పెద్ద తలనొప్పిగా మారిందంటున్నారు. అవకాశం లేదా వివాదం వస్తే చాలు రంగంలోకి దిగిపోయి రాజకీయ దాడి చేయడమే వీరి ఫార్ములాగా మారింది. పాలక పక్షం ఇరకాటంలో వుంటే వీరి దాడి ఇంకా తీవ్రంగా వుంటుంది. గద్దె రామమోహనరావు మాత్రం ఈ పోటీలో అంతగా పాల్గొనరు. కేశినేని నానిది మరో స్టైల్. కొంతమంది గుంటూరు నేతలను కూడా ఈ జాబితాకు కలపాల్సి వుంటుంది. మంత్రులుగా వున్నా దేవినేని ఉమ, పత్తిపాటి పుల్లారావు కూడా ఈ రేసులో శక్తికొద్ది పాల్గొంటున్నారు. వీరంతా దశలవారిగా తిట్టిపోశాక అధినేత,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడు పెదవి విప్పుతారు. లేదంటే మీడియాలో తన వ్యాఖ్యలు వచ్చేలా చూసుకుంటారు. ఇంతలో మరో సమస్య మరో సంవాదం,, మరో సంఘర్షణ.. పైకి జరిగే సంఘర్షణ కంటే లోలోపల పార్టీలో జరిగేది మరింత తీవ్రంగా వుంటున్నట్టు వాపోతున్నారు. తప్పో ఒప్పో.. తప్పదు కదా…