ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రతో జనంలోకి వెళుతుంటే ప్రభుత్వ పక్షం టిడిపి పథకాలతో ప్రజలను ఆకట్టుకోవడానికి వ్యూహం రూపొందిస్తున్నది. సంక్షేమ పథకాల అమలు ప్రచారం పేరిట ప్రజల్లోకి వెళ్లేందుకు భారీ కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం వస్తున్నది. విశేషమేమంటే ఇటీవల నంద్యాల కాకికాడ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించిన పద్ధతులను రాష్ట్రమంతటికీ విస్తరింపచేయాలని భావిస్తున్నారట.కనుకనే నంద్యాలలో పనిచేసిన పదిహేను మంది ఎంఎల్ఎలతో ఒక కమిటీని ఏర్పాటు చేశారట. నిధుల సేకరణ, నిర్వహణ కూడా ఈ కమిటీయే చూసుకొంటుందనేది అవగాహన. ఇందులో మంత్రులు యనమల రామకృష్ణుడు, లోకేశ్, ఆదినారాయణ రెడ్డితో పాటు చీరాల ఎంఎల్ఎ ఆమంచి కృష్ణమోహన్‌కు కూడా స్థానం కల్పించారు. వివిధ రకాల ఫెడరేషన్ల ద్వారా, గ్రామీణాభివృద్ధి విభాగాల ద్వారా కులాల వారి లెక్కలపై మరో శిక్షణ తతంగం ఇప్పటికే నడుస్తున్నది. ప్రతి గ్రామంలోనూ రంగాల వారీ సమీక్షలకోసంనాలుగు కమిటీలను ఏర్పాటు చేశారు. చెప్పాలంటే బాగా ముందు నుంచే పాలకపక్షం లోలోపల ఎన్నికల హడావుడి పెంచుతున్నదన్నమాట. ప్రతిపక్షం సరే సరి. చూస్తుంటే సవాళ్లు ఎన్నిచేసుకుంటున్నా ఉభయులనూ ఒక విధమైన అభద్రత వెన్నాడుతున్నట్టే వుంది!