ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి చేసిన రాజీనామా ఇంకా అసెంబ్లీ స్పీకర్ కు అందలేదు. దాని గురించి మాట్లాడేందుకు కూడా ఆయన సుముఖంగా లేరు! కొద్దిరోజులు మౌనంగా ఉండి.. పార్టీలో తన స్థానమేంటో స్పష్టమయ్యాకనే కాంగ్రెస్ నేతగా రేవంత్ క్రియాశీలం అవుతారు అనేది అర్థమౌతూనే ఉంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరింత శక్తిమంతంగా ముందకు నడిపించేందుకు కొన్ని వ్యూహాలతో రేవంత్ ఉన్నారట! వాటిల్లో ఒకటీ పాదయాత్ర అని చెప్పుకోవచ్చు. నిజానికి, ఆయన రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని ఎప్పుడో నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, కాంగ్రెస్ లో చేరిన తరువాత దీని గురించి ఇంతవరకూ రేవంత్ మాట్లాడలేదు. కానీ, ఆయన అనుచరులు మాత్రం పాదయాత్ర ఉంటుందనే అభిప్రాయాన్ని ఇప్పుడు వ్యక్తం చేస్తున్నారని సమాచారం! పార్టీని బలోపేతం చేసేందుకు రేవంత్ ఈ యాత్ర చేస్తారనే చర్చ ఇప్పుడు తెరమీదికి వస్తోంది. అయితే, ఇన్నాళ్లూ లెక్క వేరు, ఇప్పుడున్న లెక్క వేరు కదా! ప్రస్తుతం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు కదా..!
పార్టీపరంగా చూసుకుంటే.. కాంగ్రెస్ తరఫు పాదయాత్ర చేసేందుకు కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఇదివరకే ముందుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా తిరిగి, పార్టీని గెలిపించుకుంటామన్నారు. ఈ ప్రతిపాదన రాష్ట్రనేతల ముందుంచారు. ఢిల్లీ వరకూ ఈ ఆలోచన వెళ్లింది. తన పాదయాత్ర ప్రతిపాదనపై సానుకూలంగా స్పందిచాలంటూ హైకమాండ్ అనుమతి కూడా ఆయన కోరినట్టు ఆ మధ్య చెప్పుకున్నారు. అయితే, అధినాయకత్వం నుంచి ఎలాంటి సంకేతాలు వెలువడలేదు. దీన్ని వారు పెద్దగా పట్టించుకోనట్టుగానే ఉన్నారు. దీంతో కోమటిరెడ్డి కూడా పాదయాత్ర గురించి మాట్లాడటం మానేశారు. ఆ తరువాత, రేవంత్ రెడ్డి పార్టీలో చేరేందుకు రాహుల్ ను కలిశారు కదా! ఆ సందర్భంలో పాదయాత్ర ప్రతిపాదన కూడా ప్రస్థావనకు వచ్చిందని కొంతమంది చెబుతున్నారు. దీనిపై రాహుల్ ఎలా స్పందించారనేది బయటకి రాలేదు. అయితే, రేవంత్ పాదయాత్ర చేయాలనుకుంటే పార్టీ పెద్దల అనుమతి తప్పనిసరిగా ఉండాలంటూ కొంతమంది టి. కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.
ఎలాగూ వచ్చే నెల మొదటివారంలోగా రేవంత్ కు పార్టీలో దక్కనున్న ప్రాధాన్యత ఏంటో తెలిసిపోతుంది. కానీ, పాదయాత్ర విషయమై మాత్రం కొంత చర్చ తప్పేట్టు లేదు. ఎందుకంటే, రేవంత్ పాదయాత్రకు హైకమాండ్ అనుమతి ఇస్తే.. కోమటిరెడ్డితో కొత్త సమస్యకు ఆస్కారముంది. రేవంత్ కంటే ముందే తాను అనుమతి కోరినా అధిష్ఠానం పట్టించుకోలేదనే విమర్శలు ఉంటాయి కదా. మరి, ఈ నేపథ్యంలో అనుచరులు ఆశిస్తున్నట్టు రేవంత్ పాదయాత్ర చేస్తారా అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. చాలామందిని రేవంత్ ఒప్పించాల్సి ఉంది.