విశాఖపట్నం జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వైసీపీ వీడనున్నారని, టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటారని, ఈ మేరకు అనుచరులతో ఆమె సమాలోచనలు జరుపుతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖపట్టణం జిల్లా పాడేరు శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరితో వైసీపీ అధినేత జగన్ శనివారం ఫోన్‌లో మాట్లాడారు.
మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు వైసీపీలో చేరడంపై గిడ్డి ఈశ్వరి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. పాడేరు టికెట్ ఇవ్వలేదనే కారణంతో టీడీపీలో చేరిన కుంభా రవిబాబు ఇప్పుడు తిరిగి వైసీపీలో చేరారు. అరకు టికెట్ ను రవిబాబుకే ఇస్తామనే హామీ వైసిపి నుంచి వచ్చాకే ఆయన పార్టీలో చేరినట్టు సమాచారం. దీంతో అలకబూనిన ఆమె వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్ర ప్రారంభానికి ముందే కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఏర్పాటు చేసిన రాత్రి బస ప్రాంతం నుంచి ఆమెతో మాట్లాడినట్లు పార్టీవర్గాల ద్వారా తెలిసింది. అనకాపల్లి పార్లమెంటు పార్టీ ఇన్‌చార్జి జగన్‌ను కలిసి గిడ్డిఈశ్వరి అంశంపై చర్చించినట్లు సమాచారం.
గిడ్డి ఈశ్వరితో ఫోన్‌లో మాట్లాడిన జగన్ సమస్య ఏంటో తన వద్దకు వచ్చి చెప్పాలని ఆమె కు సూచించినట్లు తెలుస్తోంది. ఇంతకాలం తాను చెప్పిం ది పట్టించుకోకుండా ఇప్పుడు పార్టీ మార్పు వార్తలు వచ్చాయని ఫోన్ చేశారే కాని తన సమస్య పరిష్కరించడానికి కాదన్నట్లుగా గిడ్డి ఈశ్వరి మాట్లాడినట్లు తెలుస్తోంది.