తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి అమరావతిలో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రముఖ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ సాధించిన విజయాలు, కార్యకర్తల సంక్షేమం కోసం చేసిన కార్యక్రమాలను నేతలు ఎకరవు పెట్టారు. అన్న నందమూరి తారక రామారావు ఇచ్చిన ఆత్మ గౌరవం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇస్తున్న ఆత్మ విశ్వాసంతో మరిన్ని విజయాలు సాధిస్తామంటూ నేతలు చెప్పారు. చంద్రబాబు మాట్లాడుతూ… ప్రజల సంక్షేమమే పరమావధిగా పార్టీ పనిచేస్తోందనీ, తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారి సంక్షేమం కోసం పని చేస్తుందని చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ కూడా మాట్లాడారు.
రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకుని రావాలన్న లక్ష్యంతోనే స్వర్గీయ ఎన్టీఆర్ టీడీపీ స్థాపించారు అని రమణ అన్నారు. పార్టీ ఏర్పాటుతో తెలంగాణ ప్రాంతంలో ప్రజలకు మరో స్వతంత్రం వచ్చినట్టు అయిందని చెప్పారు! అంతకుముందు వరకూ కొన్ని సామాజిక వర్గాల చేతుల్లోనే అధికారం ఉండేదనీ, కానీ అన్ని రంగాలతోపాటు రాజకీయ రంగంలో కూడా అన్ని వర్గాలకూ ప్రాధాన్యత ఉండాలని ఆనాడు పార్టీ ఏర్పాటైందన్నారు. ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తినైన తాను సమాజంలో గౌరవం పొందుతున్నానంటే దానికి కారణం పార్టీ నాయకత్వం, ఆలోచనా విధానమే అన్నారు. ఆ స్ఫూర్తిని నారా చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారన్నారు. తెలంగాణలోని పార్టీ కార్యాలయానికి ప్రాధాన్యత ఇస్తూనే.. అమరావతి నుంచి జాతీయ స్థాయిలో పార్టీ ఎదగాలని రమణ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తగు ప్రాధాన్యత ఇస్తూ, రాష్ట్రంలో పార్టీ మరింత ముందుకెళ్లాలన్నారు.
ఈ ప్రసంగంలో రమణ కాస్త తడబడ్డారా అనిపిస్తుంది. ముందుగా ‘ఆంధ్రుల ఆత్మగౌరవం’ అనేసి.. తరువాత, గొంతు సవరించుకుని ‘తెలుగువారి ఆత్మగౌరవం’ అంటూ మార్చుకున్నారు. అంతేకాదు, అమరావతిలో పార్టీ జాతీయ కార్యాలయం నిర్మిస్తుంటే.. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను మరచిపోవద్దూ మరచిపోవద్దూ అని గుర్తు చేస్తున్న విధంగా రమణ మాట్లాడటం విశేషం. అందుకే, ట్రస్ట్ భవన్ కు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా రెండుసార్లు ప్రస్థావించారు. అంటే, అమరావతిలో ఆఫీస్ కట్టేసుకుంటే.. తెలంగాణలో పార్టీ గురించి పెద్దగా పట్టించుకోరేమో అని రమణ ఆందోళన చెందుతున్నట్టుగా ఉంది. మొత్తానికి, రమణ మాటల్లో కాస్త తడబాటు, కొంత ఆందోళన ధ్వనిస్తున్నట్టుగా అనిపించింది.