గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో వైకాపా ఆధిపత్యం ప్రదర్శించింది. మెజారిటీ స్థానాలు దక్కించుకుంది. కానీ, ఆ తరువాత, ఆ జిల్లాకు చెందిన ప్రముఖ నేతలు నెమ్మదిగా టీడీపీకి వలస వెళ్లడం మొదలైంది. దీంతో వైకాపా పట్టు కొంత సడలిందనే చెప్పుకోవాలి. ఇక, కొన్ని నెలల కిందట జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కోవడంతో.. ఆ జిల్లాలో పార్టీకి బాగానే దెబ్బపడింది. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరడం, ఆమెతోపాటు మరికొంతమంది వైకాపాని వీడటం కూడా జరిగిపోయింది. ఈ పరిణామాల తరువాత జగన్ పాదయాత్ర మొదలుపెట్టారు. కర్నూలు జిల్లాలో తన పాదయాత్ర ముగిసేనాటికి, పార్టీలోకి బలమైన నేతల చేరిక ఉండాలనే వ్యూహరచన చేశారట. కానీ, అది బెడిసికొట్టిందని తెలుస్తోంది! అందుకే, లద్దరిగి మీదుగా కోడుమూరుకు తన పాదయాత్ర సాగేలా రూట్ మ్యాప్ తయారు చేసుకున్నారట. కానీ, అనూహ్యంగా ఈ రూటును వైకాపా శ్రేణులు మార్చేశాయి. దీని వెనక అసలు కారణం వేరే ఉందని సమాచారం.
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీ మార్పు వార్త ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. ఆయన కాంగ్రెస్ ను వీడే ఆలోచనలో ఉన్నారంటూ మీడియాలో కథనాలు రావడం… అలాంటిదేం లేదనీ, ఉన్నంత కాలం తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని కోట్ల ఖండించడం అనేది రొటీన్ వ్యవహారంగా మారిపోయింది. కర్నూలు జిల్లాలోకి జగన్ పాదయాత్ర రాగానే… కోట్ల వైకాపాలోకి వస్తారనే గుసగుసలు మళ్లీ తెరమీదికి వచ్చాయి. ఎలాగైనా కోట్లను తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు కొందరు వైకాపా నేతలు ప్రయత్నించినట్టు చెబుతున్నారు. దానికి అనుగుణంగానే కోట్ల స్వగ్రామం మీదుగా జగన్ పాదయాత్ర కొనసాగేలా మొదట రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నారు. సరిగ్గా జగన్ యాత్ర అక్కడికి చేరుకునే లోపుగా కోట్లను ఒప్పించొచ్చు, జగన్ తో భేటీ ఏర్పాటు చేయొచ్చు అని కర్నూలు వైకాపా నేతలు భావించారు. అయితే, ఈ ప్రయత్నాలు కోట్ల వరకూ వెళ్లేసరికి.. ఆయన స్పందన మరోలా ఉందని సమాచారం. తాను పార్టీ మారేదే లేదనీ, ఆ ఆలోచనలో ఉన్నానని ఎవరు చెబుతున్నారంటూ ఉల్టా ప్రశ్నించడంతో నేతల ప్రయత్నాలకు బ్రేకులు పడ్డట్టు సమచారం!
అందుకే, జగన్ పాదయాత్ర రూట్ వెంటనే మారిపోయిందనే కథనాలు వినిపిస్తున్నాయి. కోట్ల మనోగతాన్ని జగన్ కు జిల్లా నేతలు వినిపించారనీ చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో పట్టున్న బీసీ నాయకుడి కోసం వైకాపా అన్వేషణ కొనసాగుతోందని వినిపిస్తోంది. పాదయాత్ర పూర్తయ్యాక, ఎన్నికల ముందు కోట్ల విషయమై మరోసారి పునః ప్రయత్నాలు ఉండొచ్చనే ఆశాభావం కర్నూలు వైకాపా శ్రేణుల్లో లేకపోలేదు..!