ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అంటూ కోతలు కోసేవాడు కూడా నివ్వెరపోతాడు అతడిని చూస్తే. ఎందుకంటే ఆయన కొడుకు పేరు మాత్రమే కాదు వాడి కొడుకు పేరు కూడా చెప్పేస్తున్నాడు మరి. ఆయనెవరో కాదు… లక్ష్మీస్ వీరగ్రంధం పేరుతో సినిమా తీస్తున్నానంటూ గత కొంతకాలంగా హడావిడి చేస్తున్న కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి.
నిజానికి ఈ సినిమా ప్రకటనకు ముందు సాధారణ జనాల మాట అటుంచి సినీ పరిశ్రమలో కూడా చాలా కొద్ది మందికి మాత్రమే పరిచయం అట ఈయన. అప్పుడెప్పుడో ఓ చౌకబారు మళయాళ సినిమాను తెలుగులో కామాగ్ని పేరుతో విడుదల చేశాడని అంతకు మించి ఆయనకు పరిశ్రమతో పెద్దగా సంబంధాలు లేవని అంటున్నారు సినీజనం.
అయితేనేం… కేతిరెడ్డి… ఏకంగా ఎ.పి రాజకీయాల్లో కీలకమైన, ఓ గొప్ప నేతకు సంబంధించిన జీవితంలోని కొన్ని విషయాల్ని గుదిగుచ్చి సినిమా తీయడానికి సాహసించాడు. తీస్తాడో లేదో కాని.. సినిమా తీస్తున్నానంటూ చేస్తున్న హడావిడికి అంతు లేకుండా పోయింది. తొలుత ఓ పోస్టర్ తో ప్రారంభించాడాయన. ఆ తర్వాత ఎన్టీయార్ ఆత్మ తనతో మాట్లాడుతోందంటూ ఒకట్రెండు వీడియోల్ని చిత్రీకరించి విడుదల చేశాడు. ఆ తర్వాత ఎన్టీయార్ ఘాట్ దగ్గర షూట్ చేయబోయాడు. అలాగే లక్ష్మీపార్వతి స్వగ్రామానికి వెళ్లి అక్కడి వారితో మాటా మంతీ జరిపాడు. ఇలాంటివే చాలా చాలా చేశాడు. మధ్య మధ్యలో లక్ష్మీపార్వతి చేసిన విమర్శలకు బదులిచ్చాడు… ఏదైతేనేం… ఆయన తంతు చూస్తుంటే… సినిమాలు తీసే సంగతెలా ఉన్నా… వీలున్నంతగా వార్తల్లోకి ఎక్కాలనే తాపత్రయం మాత్రం బాగానే కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
షూటింగ్ ప్రారంభమైపోయిదంటున్న ఆయన ఇప్పటిదాకా తన సినిమాలో కీలకంగా నటించే నటులెవరో తేల్చనేలేదు. లక్ష్మీపార్వతి పాత్ర కోసం వాణీవిశ్వనాధ్ను అనుకుంటున్నామన్నాడు. ఆ తర్వాత ప్రియమణి, పూజాకపూర్… వగైరా పేర్లు రంగంలోకి వచ్చాయి. వీరగంధం సుబ్బారావు పాత్రకు నరేష్, ఎల్బీశ్రీరాం, సత్యరాజ్… వగైరా పేర్లు వస్తూ పోతూ ఉన్నాయి. ఇక ఎన్టీయార్ పాత్రధారి ఖరారవ్వనే లేదు. అయినప్పటికీ షూటింగ్ మొదలైపోయిదంటున్న కేతిరెడ్డి… తాజాగా ఇంకో సినిమాకు సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చాడు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కధతో శశిలలిత అనే పేరుతో సినిమా తీస్తానని. నమ్మేద్దాం లెండి. టైంపాస్ కోసం ఇలాంటి కబుర్లు కావాల్సిందేగా….