పాదయాత్రలో రోజు రోజుకూ రెట్టించిన ఉత్సాహంతో సాగిపోతున్న వైసీపీ అధినేతకు ఇది అత్యంత నిరుత్సాహం కలిగించే విషయమే అనడంలో సందేహం లేదు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వైకాపాకి గుడ్‌బై చెప్పనున్నారు. గత కొన్ని రోజులుగా ఈ వార్త హల్ చల్ చేస్తోన్నప్పటికీ ఆదివారం నాటికి ఆమె పార్టీ ఫిరాయింపు దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఆమెని బుజ్జగించడానికి ముఖ్యమైన పార్టీ నేతలతో పాటు సాక్షాత్తూ అధినేత సైతం ప్రయత్నించినా… ఫలితం లేకుండా పోయిందని తెలుస్తోంది. పార్టీ మారడానికి సూత్రప్రాయంగా నిర్ణయించుకున్న గిడ్డి ఈశ్వరి రేపో మాపో ముహూర్తం నిర్ణయించుకున్నారట.
ప్రస్తుతం వైసీపీకి అసెంబ్లీలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలలో గిడ్డి ఈశ్వరి ఒక ప్రధాన బలం అనడం నిస్సందేహం. బలహీన వర్గాల ప్రతినిధిగా ఆమె అధికారపార్టీపై పలు సందర్భాల్లో గట్టిగా పోరాడారు కూడా. అయితే ఇటీవల స్థానికంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఆమెకు రుచించడం లేదు. మరికొన్ని అంశాలు కూడా ఉన్నప్పటికీ ముఖ్యంగా అరకు నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ దగ్గరే సమస్య వచ్చిందని సమాచారం. ఆ టిక్కెట్‌ను తన మద్ధతుదారైన ఫాల్గుణకు ఇప్పిస్తానని ఈశ్వరి మాట ఇచ్చారట. సదరు ఫాల్గుణ గతంలో బ్యాంకు ఉద్యోగిగా ఉండి స్వఛ్చంద పదవీ విరమణ తీసుకున్నారు. ప్రస్తుతం ఈశ్వరికి అన్ని రకాలుగా ఆయన అండదండలు అందిస్తున్నారు. దీంతో అతనికి అరకు టిక్కెట్ ఇవ్వాలని ఈశ్వరి ఎంతో కాలంగా అధినేతకు విన్నవిస్తూ వస్తున్నారట. ఈ నేపధ్యంలో ఒకసారి టీడీపీలో చేరి, పార్టీలోకి తిరిగొచ్చిన కుంభా రవిబాబుకి ఆ టిక్కెట్ ఖారారైనట్టు సంకేతాలు రావడంతోనే ఈశ్వరి ఆగ్రహించారట. దీంతో వైసీపీకి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
ఏదైమనా… బలహీన వర్గాల్లో పట్టున్న ఓ మహిళా ఎమ్మెల్యేను పోగొట్టుకోవడం వైసీపీకి నిస్సందేహంగా మైనస్ కానుందని రాజకీయవిశ్లేషకులు అంటున్నారు. గత కొంతకాలంగా పార్టీ బలోపేతం కోసం అంటూ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే ఇప్పుడు పార్టీ బలహీనపడడానికి కారణంగా మారుతున్నాయంటున్నారు. పోయిన వాళ్లు పోగా ఉన్నవాళ్లనైనా కాపాడుకోవడానికి వైసీపీ దగ్గర సరైన వ్యూహమే కొరవడినట్టు కొనసాగుతున్న వలసలు నిరూపిస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.