ఎపి నూతన రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం ఎంత ప్రచారం చేస్తున్నా వాస్తవంలో పెద్ద కదలిక లేదనే అభిప్రాయం పెరుగుతున్నది. ఇటీవలనే పర్యావరణ పరంగా ఎన్జిటి పచ్చజెండా వూపిందని వార్తలు వచ్చినా వాస్తవంలో అది పెట్టిన షరతులే ఎక్కువగా వున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా జాతీయ పర్యవేక్షణలో వేసే కమిటీ ఆమోదం పొందిన తర్వాతనే అడుగు ముందుకేయాలని నిర్దేశించింది. కృష్ణానది కరకట్టకు భంగం కలిగించరాదని, కొండవీటివాగు ప్రవాహగమనాన్ని మార్చరాదని చెప్పడం మరో రెండు ముఖ్యాంశాలు. ఈ రెంటినీ పాటిస్తే ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికలే గాక సింగపూర్‌కు అప్పగించిన భూభాగంలోనూ నిర్మాణాలకు చాలా నిబంధనలు ఆటంకమవుతాయి. తాజాగా విజయవాడలో జరిగిన ఒక సదస్సులో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సమక్షంలోనే స్థానిక రైతులు తమ భూమిని సింగపూర్‌కు ఇవ్వడం సరికాదని అభ్యంతరాలు వెల్లడించారు. సింగపూర్ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా పరిశీలకులను పంపించి అధ్యయనం చేయిస్తున్నది. మరో వంక ప్రపంచ బ్యాంకు కూడా అనేక సందేహాలు వివరణలు కోరుతున్నది.ప్రజలతో ముఖాముఖి నిర్వహించింది. వీటన్నిటితో పరిస్థితి ఎక్కడకు వచ్చిందంటే ప్రపంచబ్యాంకు ఇచ్చే 3400 కోట్ల రుణం కోసం చూసే బదులు మరేదైనా ఇతర చోటికి వెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మొదలుపెట్టినట్టు కనిపిస్తుంది. ప్రపంచబ్యాంకుకు ప్రతిపక్షాలు తప్పు సమాచారం ఇచ్చాయని టిడిపి తీవ్రంగానే ఆరోపణలుచేసింది.అయితే ఇప్పుడు అధికారికంగానే అంతర్జాతీయ స్థాయిలో అనుమానాలు రావడంతో ఆలోచనలో పడింది. కేంద్రం కూడా మాటలు చెప్పడం తప్ప రాజధాని విషయంలో ఆసక్తి ప్రదర్శించడం లేదు. వెంకయ్య నాయుడు పట్టణాభివృద్ధి మంత్రిగా వున్నప్పుడు ఇతర పేర్లతో కొన్ని నిధులు విడుదల చేయగా వాటిని రాజధాని కేటాయింపుల కింద చూపేవారు. ఇప్పుడా అవకాశం కూడా లేకుండా పోయింది. నిజంగా అమరావతిలో ఎలాటి పురోగతి చూపించాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి సవాలుగానే మారనుంది.