ఏపీ ప్రతిపక్ష నేత జగన్ చేపడుతున్న ప్రజ సంకల్పయాత్ర 18వ రోజు పూర్తయింది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. కొడుమూరు మండలంలో ఆయన బీసీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగించారు. రొటీన్ గానే తెలుగుదేశం సర్కారుపై విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడనీ, చంద్రబాబు నాయుడు పాలన చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందనీ, నవ్వొస్తోందనీ, ఇలాంటి నాయకులకు మళ్లీ అవకాశం ఇవ్వకూడదనీ, చంద్రబాబును ఇంటికి పంపించే సమయం వచ్చిందనీ, రాజకీయాల్లో విశ్వసనీయత అనే పదానికి అర్థం లేకుండాపోయిందనీ, ప్రజలను మోసం చేశాడనీ.. ఇవే అంశాలను మళ్లీ మళ్లీ చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే.
బీసీల ఆత్మీయ సమ్మేళనంలో కొన్ని కొత్త హామీలు జగన్ ఇచ్చారు. బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు. పశువులకు చికిత్సలు చేయించే విధంగా 102 సేవలు తీసుకొస్తామన్నారు. ప్రతీ జిల్లాలోనూ పార్టీ తరఫున నాలుగు కమిటీలు వేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో అనంతపురం లేదా కర్నూలు నుంచి ఒక ఎంపీ టిక్కెట్ బోయ సామాజిక వర్గానికి ఇస్తామన్నారు. దివంగత వైయస్సార్ హయాంలో గొర్రెలకు ఇన్సూరెన్స్ ఉండేదనీ, చంద్రబాబు వచ్చాక అది లేకుండా పోయిందన్నారు. మహానేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతీ ఇంటికీ సంక్షేమ పథకాలు చేరేవి అని చెప్పారు. బీసీలకు లబ్ధి చేకూర్చే విధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు చేశారనీ, ఎంతోమందిని ఇంజినీర్లుగా డాక్టర్లుగా ఆ మహానేత తీర్చిదిద్దారన్నారు. మనం అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం తీసుకొస్తామని జగన్ చెప్పారు.
ఇంతకీ, రాజన్న రాజ్యం మళ్లీ తెస్తాం అంటే… అది కాంగ్రెస్ పాలన అనే కదా అర్థం. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికైంది, పాలన సాగించిందీ కాంగ్రెస్ పార్టీ నుంచే కదా! అప్పటికి వైకాపా లేదు కదా. ఆ లెక్కన పాదయాత్ర మొదలైన దగ్గర నుంచీ జగన్ ప్రచారం చేసుకుంటూ వస్తున్నది మళ్లీ కాంగ్రెస్ పాలన తెస్తామనే అనొచ్చు. వైయస్సార్ హయాంలో సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలయ్యేవి అంటే.. అది కాంగ్రెస్ క్రెడిటే కదా. నిజానికి, ఏపీలో కాంగ్రెస్ కీ ఇదే అంశం సవాలుగా మారింది. వైయస్ హయాం గురించి వారు ప్రచారం చేసుకోలేకపోతున్నారు. సాంకేతికంగా చూసుకుంటే వైయస్సార్ హయాం గురించి ఏపీ కాంగ్రెస్ నేతలు చెప్పుకోవాలి. కానీ, అది వైకాపా ప్రచారం చేసుకుంటోంది! వైయస్సార్ హయాం అంటే వైకాపా హయాం అన్నట్టుగా పాదయాత్రలో జగన్ ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఏతావాతా జగన్ తెస్తానంటున్నది కాంగ్రెస్ పాలనే అన్నట్టుగా ఉంది. రాజన్న పాలన అంటే అదే కదా!