ఇది పాదయాత్ర ల సీజన్ లా ఉంది. జగన్ పాదయాత్ర అటు ఇంకా కొనసాగుతోంది. ఇటు రోజా తన నియోజకవర్గ సమస్య అయిన ఒక విషయం గురించి రేపటి నుంచి పాదయాత్ర మొదలు పెట్టనుంది. వివరాలిలా ఉన్నాయి.
గాలేరు-నగరి ప్రాజెక్టును త్వరతగతిన పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు వైసీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు. గాలేరు-నగరి సాధన యాత్ర పేరుతో రేపు నగరి నుంచి తిరుమలకు పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. గాలేరు-నగరి తమ నియోజకవర్గంలోని ఐదు మండలాలకి తాగునీరు, సాగు నీరు అందించే ప్రాజెక్టు అని రోజా పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 8.30 గంటలకు నగరిలో సత్రవాడ నుంచి యాత్ర ప్రారంభించి డిసెంబర్ 2వ తేదీ తిరుమల గుడిలో దర్శనంతో పాదయాత్ర ముగిస్తామని ఆమె పేర్కొన్నారు. గాలేరు-నగరి త్వరగా పూర్తికావాలని, రైతులు సంతోషంగా ఉండాలని, తాగునీటి సమస్య లేకుండా నగరి నియోజకవర్గ ప్రజలు సుఖంగా ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
అయితే ఇలాంటి సమస్యలు పాదయాత్ర తో తీరౌతాయా లేక అసెంబ్లీ లో వీటిని ప్రస్తావించి, ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువస్తే జరుగుతాయా అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. రోజా మాత్రం పాదయాత్ర కూడ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే పద్దతిలో భాగమే అని భావిస్తున్నట్టుంది. మరి దీనికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, జగన్ పాదయాత్ర జరుగుతున్న టైం లో నే మరొక పాదయాత్ర చేసినందుకు పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి