ఎపి బిజెపి శాసనసభా పక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు ఎంతలేదన్నా ఇప్పుడు ఆగ్రహ పర్వంలో వున్నారు. ప్రతిపక్షం సభను బహిష్కరించిన నేపథ్యంలో బిజెపి మౌనంగా వుండిపోయిందనే విమర్శ రాకుండా చూసుకోవాలన్నది ఆయన ఆలోచన కావచ్చు. దాంతో పాటే తమ రాజకీయ పదును కూడా చూపించాలని కోరుకుంటున్నారేమో.. ఏమైతేనేం.. ఈ మధ్య ఒకటికి రెండు సార్లు కోపతాపాలు ప్రదర్శించారు. మొన్న పోలవరం చర్చలో తనకు అవకాశం ఇవ్వనందుకు ఆగ్రహం వ్యక్తం చేసి అవకాశం సాధించుకున్నారు. అయితే చెప్పేది అనుకూల విషయాలే కదా.. మొత్తానికి విష్ణుకుమార్ రాజు ఇప్పుడు టిడిపి పైనే గాక స్వంత మంత్రిపైనా విరుచుకుపడ్డారు. ఆలయాల సమీపంలో మద్యం దుకాణాలపై దేవాదాయ శాఖామంత్రి మాణిక్యాల రావును నిలదీశారు. తమ శాఖ దగ్గర రిజిస్టర్ అయిన దేవాలయాలకు వంద మీటర్ల దూరంలో ఈ దుకాణాలను అనుమతించేది లేదని మంత్రి చెప్పారు. అయితే రిజిస్టర్ కాని ఆలయాల దగ్గర అనుమతిస్తారా? దేవుళ్ల మధ్య కూడా తేడాలు పెడతారా? అని విష్ణు చెలరేగిపోయారంతే. అక్కడ పూజిస్తేనే భక్తి మరోచోట పూజిస్తే రాదు అని చెప్పగలరా? అని లీగల్ పాయింట్లు లేవదీశారు. వాస్తవంగానే బడి గుడి నివాసప్రాంతం అన్న తేడా లేకుండా విచ్చలవిడిగా మద్యం దుకాణాలకు అనుమతి నివ్వడం పెద్ద సమస్యగా మారింది. దానికి తోడు బిజెపికి మరో ఫిర్యాదు కూడా వుంది. దేవాదాయ శాఖ తమవారికి ఇచ్చినా టిడిపి జోక్యం పెత్తనం ఎక్కువగా వున్నాయనేది వారి ఆరోపణ గతంలో రాజమండ్రి పుష్కరాల సమయంలో స్థానిక శాసనసభ్యులైన తమను విస్మరించి విపత్తు తెచ్చారనీ, ఇటీవల సదావర్తి భూముల విషయంలోనూ తమ చిత్తశుద్ధి వల్లనే సమస్య పైకి వచ్చిందని వారు చెబుతుంటారు. బహుశా ఇందులోనూ అలాటి మతలబు వుండేమో తెలియదు గాని విష్ను కుమార్ చెప్పిన విషయాలు చర్చిస్తామని మంత్రి హామీ ఇచ్చేశారు.