వడ్డించేవాడు మనవాడే… ఇక ఏ వరుసలో కూచున్నా… పంచభక్ష్య పరమాన్నాలే. ఈ సామెత కు తాజా నిదర్శనం ఏపీ ప్రభుత్వo ప్రకటనలను వడ్డించిన తీరు.
గత సెప్టెంబరు నెలలో 3 రోజుల పాటు నిర్వహించిన జలసిరికి హారతి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అన్ని దినపత్రిక లకూ ప్రకటనలు గుప్పించింది. దీని కోసం దాదాపు రూ.10.50 కోట్లు ప్రజాధనాన్ని మంచి నీళ్లు లా ఖర్చు చేసింది. విభజన దెబ్బకి కోలుకోలేని కష్టాల్లో ఉన్న రాష్ట్ర పరిస్థితి కి ఇంత ఖర్చు అవసరమా? అనే విమర్శ అలా ఉంచితే… ప్రకటనలు వడ్డించిన తీరులో చూపించిన వివక్ష ప్రభుత్వ వ్యతిరేక పత్రికలపై కక్ష సాధింపుకు నిదర్శనం గా నిలుస్తోంది.
ఈ ప్రకటనల జారీలో ప్రభుత్వం పూర్తి వివక్షను ప్రదర్శించింది. అత్యధిక సర్కులేషన్ కలిగిన ఈనాడుకు దాదాపుగా రూ.2.50 కోట్లు విలువైన ప్రకటనలు ఇచ్చింది. ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న సాక్షి, ఆంధ్రజ్యోతి… ఈ క్రమంలో ప్రకటనలు ఇవ్వాల్సి ఉండగా… ఆంధ్రజ్యోతి ని 2 వ స్థానంలో నిలబెట్టి దాదాపు రూ.2 కోట్లు సమర్పించింది.
ఇక సాక్షిని కనీసం 3 వ స్థానంలో కూడా చూడడం ఇష్టం లేదనుకుంటా… ఏకంగా సూర్య, ఆంధ్ర ప్రభ ల కన్నా కిందకి తోసేశారు. సూర్య దినపత్రిక కు కూడా రూ…1కోటి పైన, ప్రభకి దాదాపు రూ.80లక్షల దాకా ఇచ్చి, సాక్షికి మాత్రం రూ 64లక్షల తో సరిపెట్టారు.
ప్రతీ విషయంలో ప్రభుత్వ లోపాలను భూతద్దంలో చూపించే సాక్షికి ప్రకటన లు ఎందుకివ్వాలి అని ఏలిన వారు అనుకోవచ్చు కానీ అది ప్రజాధనం అని, ఎవరు అధికారంలోకి రావాలో, ఏ దినపత్రిక ఏ స్థానంలో ఉండాలో నిర్ణయించేది కూడా ప్రజలే అని పాలకులు గుర్తించకపోతే… అది కూడా ఓ రకంగా ప్రజాతీర్పును అగౌరపరిచడమే.