హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోడీ తనవైన చమక్కులు చేశారు. మెట్రో ప్రారంభోత్సవ సందర్బంలో మంత్రి కెటిఆర్ లేకపోవడం గమనించి ఆరా తీశారు. ఆయన వచ్చాక పక్కన నిలబెట్టుకుని మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇదంతా ప్రసన్న వదనంతో చూడటం కనిపించింది. ఇక రైలులో కెటిఆర్ కెసిఆర్ తదితరులతో పాటు బిజెపి రాష్ట్ర అద్యక్షుడు కె.లక్ష్మణ్ కూడా ప్రధాని పక్కనే కూచున్నారు. ఈ ప్రారంభోత్సవానికి తర్వాత గ్లోబల్ సమిట్కు మధ్య వ్యవధిలో ప్రధాని బేగంపేటలో బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తెలుగులో చాలా వాక్యాలు చెప్పి వారిని హుషారు చేశారు. కర్ణాటక మినహా దక్షిణ భారత రాష్ట్రాల పేర్లు చెబుతూ ఈ రాష్ట్రాల్లో బిజెపికి అధికారంలోకి వచ్చే అవకాశం కలగకపోయినా కార్యకర్తలు ప్రజలతో వుండిపనిచేస్తున్నారని అభినందించారు. తెలంగాణ అభివృద్ధికి ఇతోధికంగా సహాయపడుతున్నట్టు కూడా చెప్పారు. తాము రాష్ట్రంలో పోరాడుతుంటే కేంద్ర నేతలు వచ్చి కెసిఆర్ ప్రభుత్వాన్ని ప్రశంసించి వెళ్లడం ఇబ్బందిగా వుందని బిజెపి నేతలు ఫిర్యాదు చేస్తుంటారు. ఈ సారి ఆ అవకాశం లేకుండా మోడీ జాగ్రత్త పడినట్టు కనిపిస్తుంది.