అమెరికా ఇండియా భాగస్వామ్యంతో మూడు రోజులు జరిగే హైదరాబాద్ గ్లోబల్ యాంటప్రూనర్స్ సదస్సు అంగరంగ వైభోగంగానే ప్రారంభమైంది. ముందుగా కొన్ని సాంకేతిక తళుకులు కళా ప్రదర్శన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ స్వాగత వచనాలు పలికారు. అనంతరం ప్రధాన ప్రసంగం చేసిన ట్రంప్ కుమార్తె, అదికారిక సలహాదారు ఇవాంకా మోడీని, సభికులకూ ప్రశంసలతో ముంచెత్తారు. భారతీయులకు శ్వేతసౌధంలో ఒక నిజమైన స్నేహితుడున్నాడని ట్రంప్ అన్నమాటలు గుర్తు చేశారు. మహిళా సాధికారికత, వాణిజ్య చొరవలు అమెరికాలో పరిస్థితులు వివరంగా పేర్కొంటూ ఇండియా కూడా ఈ విషయంపై శ్రద్ధ పెట్టాలని కోరారు.ముందుగా సమాచారం వుందో లేక సరైన సూచనలు చేయలేదో తెలియదు గాని ఆమె ముఖ్యమంత్రి కెసిఆర్ పేరు ప్రస్తావించలేదు. దానికి బదులు గవర్నర్ నరసింహన్‌కు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అందరికీ కృతజ్ఞతలు అని మాత్రమే అన్నారు. కెసిఆర్‌తో పాటు ఇంకా చాలా మంది కేంద్ర మంత్రులు వున్నారు గనక చెప్పలేదా? అమెరికా పద్ధతిలో గవర్నర్ పాత్ర ముఖ్యమని భావించారా? కాకపోతే కేంద్రంతో కలసి చేస్తున్నారు గనక వారి ప్రతినిధిగా గవర్నర్ పేరే ప్రోటోకోల్లో పెట్టుకున్నారా? తెలియదు. తర్వాత మాట్లాడిన ప్రధాని మోడీ సహజ ధోరణిలో ప్రభుత్వ విధానాలను వివరించారు.ఆయన మాత్రం కెసిఆర్ తదితరులను ప్రస్తావించి అభినందించారు.