నాన్నకు ప్రేమతో వచ్చేసింది. డిక్టేటర్ ధియేటర్లను హిట్ చేశాడు. ఎక్స్ ప్రెస్ రాజా.. సిల్వర్ స్క్రీన్ ఎక్స్ ప్రెస్ ఎక్కేశాడు. ఇక సోగ్గాడొక్కడే సంక్రాంతి బరిలో పెండింగ్ లో ఉన్నాడు. కింగ్ కూడా రంగంలోకి దిగితే అప్పుడు అసలు మజా వస్తుంది. నలుగురు హీరోలు.. అందులో ముగ్గురు స్టార్లు.. ఒక చిన్న హీరో. ఇన్ని పుంజులు బరిలో ఉంటే.. అసలు సిసలు సంక్రాంతి మజా వస్తుంది.
ఎవరికి వారు మొదటి రోజు కలెకక్షన్లు కుమ్మేస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టేస్తున్నారు. నాన్నకు ప్రేమతో మొదటి రోజు 30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు లెక్కలు వేస్తున్నారు. డిక్టేటర్ కూడా అదే రేంజ్ లో వసూళ్లు రాబట్టడం ఖాయం అని అంచనా వేస్తున్నారు. ఎక్స్ ప్రెస్ రాజా చిన్న సినిమానే అయినా.. తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మేర్లపాక గాంధీ, శర్వానంద్ ఇద్దరూ హిట్ లతో ఫామ్ లో ఉన్నారు. అయినా మొన్నటికి మొన్న చిన్న సినిమాగా రిలిజై.. సెన్సేషన్ క్రియేట్ చేసింది నాని భలే భలే మగాడివోయ్. కాబట్టి చిన్న సినిమా కాబట్టి అనే లెక్కలు ఒక్కోసారి తారుమారయ్యే చాన్స్ ఉంది. ఇక సోగ్గాడే చిన్న నాయన మీద కూడా భారీ అంచనాలున్నాయి. లుంగీలో రొమాంటిక్ గెటప్ కనిపిస్తూనే మరివైపు ఇన్నోసెంట్ గెటప్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది.
ఈ నలుగురు హీరోల్లో ఓపెనింగ్ కలెక్షన్లను చూసి.. సంక్రాంతి హీరోగా సెలక్ట్ చేయడం కష్టమే. ఓ వారం రోజులు గడిస్తేనే.. అసలు పుంజు ఎవరో తేలేది. పైగా ఈ నాలుగు సినిమాల తర్వాత మరో నెల రోజుల పాటు భారీ చిత్రాలేవీ రిలీజ్ కు సిద్ధంగా లేవు. ఫిబ్రవరిలో నాని కృష్ణగాడి వీరప్రేమగాథ వచ్చే వరకు సినిమా హాళ్లకు పెద్ద పనిలేదు. అప్పటి వరకు హౌస్ పుల్ గా ఏ సినిమా నడిస్తే.. ఆ సినిమానే సంక్రాంతి హిట్ గా లెక్క. అంటే సంక్రాంతి పుంజు ఎవరో తేలేది ఈ నెల చివరికే అన్నమాట.