గోపీచంద్, అనూ ఇమాన్యుయేల్, రాశీఖన్నా కీలక పాత్రధారులుగా జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆక్సిజన్’, రేపు విడుదల కి సిద్దమయ్యింది. మరి ఈసారైనా జ్యోతి కృష్ణ నిలబడతాడా? లేక మళ్ళీ తడబడతాడా?
ఎ.ఎం రత్నం మాంఛి ఫాం లో ఉన్నపుడు తన టీనేజ్ కొడుకైన జ్యోతికృష్ణ గురించి తెగ ఊదరగొట్టేవాడు. తను తీసిన నట్పుకాగ (తెలుగులో చిరంజీవి స్నేహం కోసం) సినిమాకి జ్యోతి కృష్ణ 17 యేళ్ళ వయసు లోనే కథనందించాడని ఎంతో పుత్రోత్సాహం తో చెప్పేవాడు. రజనీకాంత్ పడయప్ప (తెలుగులో నరసింహ) కి రచనా సహకారం అందించినట్టూ చెప్పేవాడు. తనని దర్శకుడిగా పరిచయం చేస్తూ “నీ మనసు నాకు తెలుసు” అనే సినిమా తరుణ్, త్రిష, శ్రీయ లతో తీస్తే అది కాస్తా ఫ్లాపయింది. ఒకప్పుడు మంచి హిట్లతో “ఖుషీ”గా ఉన్న ఎ.ఎం రత్నం కి – ఒక కొడుకు జ్యోతి కృష్ణ దర్శకుడు గా ఇంకో కొడుకు రవికృష్ణ హీరో గా పెట్టి తీసిన కేడీ అనే సినిమా తో సన్ స్ట్రోక్ కాదు, సన్స్ స్ట్రోక్ తగిలింది. మళ్ళీ ఇన్నాళ్ళకు ఆక్సిజన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా సినిమాని ప్రమోట్ చేయడం లో భాగంగా పలు విషయాలు చెబుతున్నాడు జ్యోతికృష్ణ –
“గోపీచంద్‌గారికి రెండు కథలు చెప్పా. ఇది నచ్చి అంగీకరించారు. మూడు షేడ్‌లున్న పాత్రలో ఆయన కొత్తగా కనిపిస్తారు. మంచి సందేశంతో ఆక్సిజన్ కథ రాశా. సస్పెన్స్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని అలరిస్తాయి” అని తన సినిమా గురించి చెప్పిన ఈయన, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా తమ సంస్థ లో సినిమా 2018 లో ప్రారంభమవుతుందని చెప్పి షాకిచ్చాడు. రత్నం నిర్మాణంలో నేసన్ దర్శకుడిగా పవన్ కళ్యాణ్ సినిమా జనవరి నుంచి సెట్స్ మీదికి వెళ్తుందని అతను చెప్పాడు. దీనికి స్క్రిప్టు లాక్ అయిందని అతను కన్ఫమ్ చేశాడు.
మరి జ్యోతికృష్ణ ఈసారైనా నిలబడతాడా? లేక మళ్ళీ తడబడతాడా? రేపటికి తేలిపోతుంది.